ఉత్తరాదిపై చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని వాసులు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది.
ఉత్తరాదిపై చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని వాసులు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది. దీంతో రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఉత్తరాదిని గతంలో ఎన్నడూ లేనంతగా చలి వణికిస్తోంది. ఎముకలు కొరికే చలితో జనం గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 118 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు చేసింది. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యల్పంగా 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఢిల్లీలో డిసెంబర్ 14 నుంచి వరుసగా 13 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు ఇలా పడిపోవడం 1901 తర్వాత ఇది రెండోసారి. 1919, 1929, 1961, 1997లలో మాత్రమే డిసెంబర్ నెలలో ఢిల్లీలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. 2019 డిసెంబర్‌లో ఇప్పటికే అత్యల్పంగా 19.85 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. పంజాబ్‌లోని బఠిండాలోను 50 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. శుక్రవారం 2.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానాలోని హిసార్‌లో 0.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ శీతాకాలంలోనే అత్యంత శీతల రోజుగా నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని పిథౌర్‌గఢ్‌లో మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జమ్ముకశ్మీర్‌లోని పహల్ గామ్ లో మైనస్ 12 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో పర్వత ప్రాంతాల్లో మళ్లీ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో గత వారం విపరీతంగా మంచు కురిసింది. శ్రీనగర్‌లోని దాల్ లేక్ సరస్సు చలికి గడ్డకట్టుకుపోతోంది. విపరీతమైన చలి కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉదయమే పనులకు వెళ్లే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్ని దుస్తులు, చలి మంటలతో జనం సేద తీరుతున్నారు.
* ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి
* ఢిల్లీలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
* గత 118 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
* శనివారం(డిసెంబర్ 28,2019) ఉదయం అత్యల్పంగా 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం-వాతావరణ శాఖ