PM Modi On GST Reforms: దేశాభివృద్ధికి బూస్టర్ డోస్, ప్రజలకు దీపావళి గిఫ్ట్..! జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ..
జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్కరణలు ఏ విధంగా ప్రజలకు, దేశానికి ప్రయోజనం కలిగిస్తాయో ఆయన వివరించారు.

PM Modi On GST Reforms: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ గా అభివర్ణించారు. దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందన్నారాయన. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం అని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. దేశాభివృద్ధికి, దేశ మద్దతుకు బూస్టర్ డోస్ లభిస్తుందని ఆకాంక్షించారు. కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ మరింత ముందే సాకారం అవుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలి..
‘మేడిన్ ఇండియాపై అందరూ ఆలోచించాలి. గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదం అందరం పాటిద్దాం. స్వదేశీ విధానంతోనే మరింత స్వావలంబన సాధించగలం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలి. మన దేశంలో తయారు చేసిన వస్తువులనే వాడాలి.
దేశీయ ఉత్పత్తులు వాడేందుకు గర్వపడాలి. మేడిన్ ఇండియాపై చిన్న, పెద్ద అందరూ ఆలోచించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. స్వదేశీ డే స్వదేశీ వీక్ ను పండుగగా నిర్వహించుకోవాలి. దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దాం” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
స్వదేశీ ఉత్పత్తుల ఉద్యమం రావాలి..
”హర్ ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. హర్ ఘర్ తిరంగా నినాదాన్ని ఆదరించిన తరహాలోనే ఇంటింటి స్వదేశీ ఉత్పత్తుల ఉద్యమం రావాలి. వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. పిల్లల్లో డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గేమింగ్, గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. యువత గ్యాంబ్లింగ్ బారిన పడకుండా చర్యలు చేపట్టాం. సరైన పద్ధతిలో వెళ్తే ఆన్ లైన్ గేమింగ్ పై మనం ఆధిపత్యం చెలాయించగలం” అని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..?