Colour Photos On EVMs: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిబంధన బిహార్ ఎన్నికల నుంచే అమల్లోకి తీసుకురానుంది. పోలింగ్ సమయంలో ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచడం ద్వారా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈవీఎం ప్యానెల్ లో సంఖ్య తర్వాత అభ్యర్థి పేరు, వారి కలర్ ఫోటో, గుర్తు.. ఇలా ఆర్డర్ లో వరుసగా ఉంటాయి.
బిహార్ ఓటర్ల జాబితాతో పాటు ఈవీఎంలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈవీఎంలపైన ఉండే గుర్తులకు సంబంధించి గందరగోళ పరిస్థితులు ఉన్నాయనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త సంస్కరణల్లో భాగంగా ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటో ముద్రించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలింగ్ సమయంలో ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, పక్కన వారి సింబల్స్ మాత్రమే ఉండేవి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై ఇప్పటివరకు కూడా కేవలం పార్టీలకు సంబంధించిన గుర్తులు మాత్రమే ఉండేవి. ఇక నుంచి అభ్యర్థుల కలర్ ఫోటోలను కూడా ఈవీఎంలలో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. బిహార్ ఎస్ఐఆర్ పై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఐఆర్ పాటు ఇతర అంశాలపై రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పలు కీలక సూచనలు చేశాయి.
ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తును చూసి మాత్రమే ఓటర్లు ఓటు వేసేవారు. ఇకపై అభ్యర్థుల ఫోటోలను కూడా ఈవీఎంలలో అందుబాటులో ఉంచడం ద్వారా ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు ఉండవు. తమ అభ్యర్థికి తాము ఓటు వేశామా లేదా అన్న స్పష్టత ఓటర్లకు వస్తుంది. ఆ ఆలోచనతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.