మిగిలినదంతా ఒకే దశలో.. బెంగాల్ ఎలక్షన్ పై ఈసీకి మమత విజ్ణప్తి

పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

Bengal election పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో నాలుగు విడతల్లో జరగాల్సి ఉన్న ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సీఎం మమతాబెనర్జీ విజ్ణప్తి చేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికల ఎన్నికల సంఘం దీనిపై ఆలోచించాలని ఓ ట్వీట్ లో మమత తెలిపారు. అదేవిధంగా, కరోనా సమయంలో బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరగడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మమత నొక్కి చెప్పారు.

మరోవైపు, కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహించేలా చూడాలని బెంగాల్ హైకోర్టు ఈసీకి ఆదేశాలిచ్చింది. కోవిడ్ నిబంధనలు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలంటూ జిల్లా న్యాయమూర్తులను కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అత్యవసర అఖిల పక్ష భేటీ నిర్వహించింది. అఖిల పక్షం భేటీ అనంతరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మాట్లాడుతూ నాలుగు విడతల పోలింగ్‌ను కుదించే అవకాశం లేదని.. అలాంటి ప్రతిపాదన కానీ, ఆలోచన కానీ తమకు లేవని ఈసీ స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకూ నాలుగు విడతల్లో భాగంగా 135 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. మిగిలిన 159 నియోజకవర్గాలకు ఏప్రిల్ 17-29 మధ్య మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్-17న ఐదో విడత పోలింగ్ కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ ఎన్నికల అధికారి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు