×
Ad

CJ Roy: తుపాకీతో కాల్చుకుని రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య..! ఐటీ సోదాలే కారణమా?

దర్యాప్తు సమయంలో కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆదాయపు పన్ను అధికారుల సమక్షంలోనే రాయ్ తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

  • Published On : January 30, 2026 / 09:38 PM IST

CJ Roy Representative Image (Image Credit To Original Source)

  • కాన్ఫిడెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ రాయ్ ఆత్మహత్య
  • పదే పదే ఐటీ సోదాలతో తీవ్ర ఒత్తిడి..!
  • ఐటీ అధికారుల ముందే గన్ కాల్చుకున్న రాయ్..!

 

CJ Roy: బెంగళూరులో విషాదకర ఘటన జరిగింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు కాన్ఫిడెంట్ (CONFIDENT) కంపెనీ ఫౌండర్, ఛైర్మన్ సీజే రాయ్. ఆయన తన లైసెన్స్‌డ్ గన్ తో తనను తాను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ తనిఖీల సమయంలోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. కాగా, ఇటీవల పదే పదే ఐటీ సోదాలు జరుగుతుండటంతో రాయ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకున్నారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

రిచ్ మండ్ సర్కిల్ సమీపంలో కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయం ఉంది. తన కార్యాలయం ప్రాంగణంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రాయ్ ఘటన వ్యాపార, రియల్ ఎస్టేట్ వర్గాలను షాక్ కి గురి చేసింది. వారిలో భయాందోళన నింపింది. వ్యాపారవేత్తపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులే మరణానికి కారణమని తెలుస్తోంది. గతంలో ఐటీ దాడులు జరిగాయని, నేడు కూడా సోదాలు జరిగాయని తెలుస్తోంది. ఈ పరిణామాలు రాయ్ లో తీవ్ర ఒత్తిడికి దారితీశాయని, ఫలితంగా ఈ విషాదకరమైన ఘటన జరిగిందని చెబుతున్నారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, దర్యాప్తు సమయంలో కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆదాయపు పన్ను అధికారుల సమక్షంలోనే రాయ్ తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సమయంలో ఆదాయపు పన్ను అధికారులు పత్రాలను పరిశీలిస్తుండగా, ఆయన తీవ్ర చర్యకు దిగారు. సి.జె. రాయ్ ఛాతిపై తుపాకీ గాయమైంది. వెంటనే ఆదాయపు పన్ను అధికారులు రాయ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయంలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిలిపివేశారు. కాగా, అప్పటివరకు సోదాల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు అన్ని యాంగిల్స్ లో దర్యాఫ్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Also Read: పడిపోయిన గోల్డ్‌, సిల్వర్‌ ధరలు.. బులియన్‌ మార్కెట్‌లో ఎందుకీ పరిస్థితి తలెత్తింది? ఇన్వెస్టర్లు ఏం చేయాలి?