మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం. ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో నాయకత్వ లేమి సృష్టంగా కన్పిస్తోంది. ఈ సమయంలో మోడీ లాంటి చరిష్మాటిక్ లీడర్ ని ఢీ కొట్టే సత్తా కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భావిస్తున్నారు.
అయితే 2017లో తన తల్లి సోనియాగాంధీ తప్పుకోవడంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టికి 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
త్వరలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో ఏఐసీసీ సమావేశం నిర్వహించి రాహుల్‌ను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రయత్నాల్లో పార్టీ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 2013లో జైపూర్ లో జరిగిన చింతన్ శివిర్ లో కార్యక్రమంలో రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను సోనియాగాంధీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ ఏడాది కాలంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. 2018 మార్చి నాటికి బీజేపీ తన అధికారాన్ని 21 రాష్ట్రాలకు విస్తరించింది. అంతకు ముందు ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. అయితే 2018 డిసెంబర్ లో జరిగిన రాజస్థాన్,ఛత్తీస్ గఢ్,మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం కోల్పోయింది.
గతేడాది నవంబర్ లో మహారాష్ట్రలో కూడా శివసేనతో అధికారం విషయంలో వచ్చిన గొడవ కారణంగా అక్కడ కూడా అధికారం కోల్పోయింది. ఇక ఇటీవల జరిగిన జార్ఖండ్ లో కూడా బీజేపీకి భంగపాటే ఎదురైంది. 2018 డిసెంబరు నుంచి జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా5 రాష్ట్రాలను కోల్పోయింది. ఈ సమయంలో బీజేపీ క్రమంగా ప్రజల ఆదరణను కోల్పోతుందని,దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన కాంగ్రెస్ నాయకత్వ లేమికి చెక్ పెట్టి,మోడీని ఢీ కొట్టే సత్తా రాహుల్ కే ఉందని భావించి మరోసారి ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు సిద్దమైంది. బీజేపీకి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి రాహుల్ ఏ విధమైన వ్యూహాలు రచిస్తారో చూడాలి మరి.