కాంగ్రెస్ నేత సుప్రియ అభ్యంతకర పోస్ట్.. కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్

కంగనా సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి.. ఇలాంటి ఫోటోలతో హిమాచల్‌ప్రదేశ్‌ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది సుప్రియ శ్రీనాథే.

లేడీ ఫైర్ బ్రాండ్.. బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ మరోసారి ట్రెండింగ్ టాపిక్ అయ్యారు. బీజేపీ ఎంపీ టికెట్ దక్కించుకున్న కంగనా.. పొలిటికల్ డిబేట్‌గా మారారు. కంగనాకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ.. ఓ కాంగ్రెస్ నాయకులు చేసిన పోస్ట్ రెండు జాతీయ పార్టీల మధ్య డైలాగ్ వార్‌కు దారి తీసింది.

కంగనా రనౌత్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సీటు ఇచ్చింది బీజేపీ. ఆ మరునాడే యూపీకి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఛైర్మన్ సుప్రియ శ్రీనాథే.. కంగనాపై విమర్శలు చేసింది. గతంలో కంగనా సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇలాంటి ఫోటోలతో హిమాచల్‌ప్రదేశ్‌ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది.

గట్టిగానే రిప్లై ఇచ్చిన కంగన
సుప్రియ శ్రీనాథే పోస్ట్‌కు కంగనా కూడా గట్టిగానే రిప్లై ఇచ్చిపడేసింది. వేశ్య కూడా మ‌నిషే.. ఆమెకు కూడా మనసు ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. నటిగా తాను అనేక పాత్రల్లో నటించానని ట్వీట్ చేసింది. పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలంటూ రాసుకొచ్చింది కంగనా.

సోషల్ మీడియాలో దుమారం
ఈ ఇష్యూ సోషల్ మీడియాలో దుమారం లేపింది. దాంతో సుప్రియ శ్రీనాథే ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టా నుంచి తొలగించింది. ఆ తర్వాత ఆమె వివరణ కూడా ఇచ్చింది. తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల యాక్సెస్‌ చాలామంది దగ్గర ఉందని.. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారని చెప్పింది. తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సుప్రియపై బీజేపీ ఫైర్
సుప్రియ శ్రీనాథే వివరణపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా ఉన్న సుప్రియ శ్రీనాథే.. ఆమె తన సొంత సోషల్ మీడియా అకౌంట్ను రక్షించుకోలేకపోతే, ఎవరు బాధ్యత వహిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు బీజేపీ లీడర్లు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సుప్రియపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. ఆనందంతో ఎమ్మెల్యే డాన్స్.. టికెట్ వచ్చింది ఆయనకు కాదు!

మరోవైపు సుప్రియ శ్రీనాథే పోస్ట్‌పై మీడియాతో మాట్లాడారు కంగనా రనౌత్. మండిని చిన్న కాశీ అంటారని.. సుప్రియ శ్రీనాథే పోస్ట్‌తో మండి ప్రజలు బాధపడ్డారని ఆమె అన్నారు. ప్రతి మహిళకు వ్యక్తిగత గౌరవం ఇవ్వాలని, అలా గౌరవం పొందే అర్హత ప్రతి స్త్రీకి ఉంటుందని చెప్పుకొచ్చింది. కంగనాపై సోషల్ మీడియాలో పోస్ట్ ఇష్యూ నేషనల్ ఉమెన్ కమిషన్‌కు చేరింది. సుప్రియ శ్రీనాథేపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు