దొందూ దొందే : కాంగ్రెస్ దేశాన్ని దోచేసింది… డ్రీమ్ -11 లో టీమ్ చేయమని బీజేపీ చెప్తోంది

AAP’S DOUBLE DIG ON CONGRESS,BIG కాంగ్రెస్,బీజేపీలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అవినీతి విషయంలో దొందూ దొందేనని ఆప్ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్న గతనెలలో పార్లమెంట్ ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ చట్టాల విషయమై కాంగ్రెస్,బీజేపీలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-13,2020)ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ లో కాంగ్రెస్,బీజేపీలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని,ఆ తర్వాత బీజేపీ వచ్చి..మేము చేస్తాము,అప్పటి వరకు మీరు డ్రీమ్ -11 లో జట్టును తయారు చేయండి అని చెప్పిందని వ్యంగ్యంగా ఆప్ ట్వీట్ చేసింది.



కాగా,సోమవారం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లోలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్…వెంటనే మూడు వ్యవసాయచట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. ఇందులో చర్చించడానికి ఏమీ లేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతరమైన పంజాబ్ రాష్ట్రంలోని ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ…బిల్లును తయారుచేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడని..ఈ చట్టాలను చేస్తున్నందుకు ఆ కాంగ్రెస్ నాయకుడు బీజేపీని అభినందించారని..ఆ తర్వాత బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని…బిల్లు పాస్ అయిన వెంటనే కాంగ్రెస్ నిరసనలు మొదలుపెట్టిందని…ప్రజలను వెధవలనుకుంటున్నారా అని కాంగ్రెస్ ని కేజ్రీవాల్ ప్రశ్నించారు.



మరోవైపు, ఈ కొత్త చట్టాలతో రైతులకు లాభమే తప్ప నష్టం ఏ మాత్రం లేదని బీజేపీ చెప్పుకొస్తుంది. ఈ చట్టాల వల్ల వ్యవసాయంలోకి కొత్త టెక్నాలజీలు వస్తాయని..రైతులకు మొరుగైన అవకాశాలు లభిస్తాయని చెబుతోంది.