జర్నలిస్ట్ ల పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

తమిళనాడులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు.ఎన్నికల ప్రచార సభ కవరేజ్ కోసం వెళ్లిన  ఫొటో జర్నలిస్ట్ లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.శనివారం(ఏప్రిల్-6,2019)విరుదునగర్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించారని బీజేపీ నాయకులు మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విరుదునగర్ సిటీలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది.అయితే కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.దీంతో సభకు వచ్చిన  తమిల్‌ వీక్లీ మ్యాగజైన్‌ కు చెందిన ఫొటో జర్నలిస్ట్‌ ఆర్‌ఎం ముత్తురాజ్‌ ఖాళీగా ఉన్న కుర్చీలను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆ జర్నలిస్ట్‌ పై దాడికి దిగారు. కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి నుంచి ముత్తురాజ్ ని కాపాడిన సహచర జర్నలిస్ట్ లు అతడిని ట్రీట్మెంట్ కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు.అయితే ముత్తురాజ్ ని కాంగ్రెస్ కార్యకర్తల దాడి నుంచి తప్పించే క్రమంలో తోపులాట జరగడంతో పలువురు జర్నలిస్ట్‌ లకు గాయాలయ్యాయి.