Vidisha Sp
Conman cheat Woman: యుక్రెయిన్ లో చిక్కుకున్న తమ పిల్లల కోసం భారత్ లోని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి ఆ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో చిక్కుకున్న తమ కూతురిని సురక్షితంగా భారత్ రప్పించేందుకు.. మాయగాడి మాటలు నమ్మి.. ఓ తల్లి మోసపోయిన ఘటన భోపాల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. యుక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. భయంకరమైన యుద్ధంతో యుక్రెయిన్ దేశం.. కోలుకోలేని వినాశనంలో చిక్కుకుంది. ఇక యుద్ధం కారణంగా దేశ ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈక్రమంలో యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తుంది.
యుక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు ఇప్పటికే ప్రణాలిక సిద్ధం చేసిన భారత విదేశాంగశాఖ.. ఆ ప్రకారం వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్, ఇమెయిల్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన వైశాలి విల్సన్ అనే ఓ మహిళ..యుక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కూతురు.. “సృష్టి” గురించి ఆందోళన చెందింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులను, జాతీయ స్థాయి నేతలను కలిసి తన కూతురిని సురక్షితంగా భారత్ కు తీసుకురావాలంటూ వేడుకుంది. వైశాలి గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి..శుక్రవారం(ఫిబ్రవరి 25న) ఫోన్ చేసి.. “తాను ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని, యుక్రెయిన్ లో ఉన్న మీ కూతురిని తీసుకురావాలంటే ఫ్లైట్ టికెట్ కింద రూ.42,000 డిపాజిట్ చేయాలంటూ” నమ్మబలికాడు.
Also read: Russia-Ukraine: పుతిన్ కాళ్లపై పడి క్షమాపణ అడుగు: జెలెన్స్కీకీ చెచెన్యా నేత హితవు
అప్పటికే కూతురు గురించి తీవ్ర ఆందోళనలో ఉన్న వైశాలి.. ముందువెనుక ఆలోచించకుండా వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతాకు రూ.42,000 నగదు బదిలీ చేసింది. అయితే డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందనా లేకపోగా.. అతని ఫోన్ నెంబర్ కూడా పనిచేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వైశాలి.. విదిశా పోలీసులను ఆశ్రయించింది. ఈఘటనపై విదిశా ఎస్పీ మోనికా శుక్లా మాట్లాడుతూ నిందితుడిని గుర్తించామని అతను ఎక్కడున్నా పట్టుకుంటామని తెలిపారు. మరోవైపు వైశాలి కూతురు సృష్టిని క్షేమంగా భారత్ కు తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారని ఎస్పీ వివరించారు.