30 లక్షల మందితో శబరిమల ముట్టడి

కేరళ రాజకీయాలు మరింత హీటెక్కాయి. శబరిమల అంశం కేంద్రంగా తిరుగుతున్నాయి. శబరిమల ఇష్యూని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో కేరళ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఏకంగా 30లక్షల మంది మహిళలతో ‘ఉమెన్స్ వాల్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నందుకు నిరసనగా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది.
ఉత్తరాన కాసర్‌గఢ్ నుంచి దక్షిణాన ఉన్న రాజధాని తిరువనంతపురం వరకు 620 కిలోమీటర్ల మేర ‘ఉమెన్ వాల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. 2019, జనవరి 1 మంగళవారం సా. 4 గంటల నుంచి 4.15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మధ్యయుగం నాటి పోకడలు, సంస్కృతి మారకుండా నివారించడానికి, లింగ సమానత్వం కోసం, సాంస్కృతిక పునరుజ్జీవన విలువలను కాపాడే ఉద్దేశంతో గ్రేట్ వాల్ ఆఫ్ కేరళ పేరుతో నిర్వహించే మానవహారానికి మహిళలు తరలివచ్చి మద్దతు తెలియజేయాలని మంత్రులు కోరారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం మానవహారం నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం చేసిన ప్రకటన రాజకీయాలను వేడెక్కించింది. దీన్ని భగ్నం చేసేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.