కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్‌లోనూ కిల్లర్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.
కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్‌లోనూ కిల్లర్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. మన దేశంలో పాజిటివ్ కేసులు లేకపోయినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ భారత్‌ను వణికిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్ లో పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రెండు నోడల్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
కరోనా వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకు వైరస్ ఎటాక్ అయ్యే అవకాశమే లేదన్నారు. ప్రజలు వదంతులు నమ్మొద్దన్నారు. దేశంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా లక్షణాలున్నవారికి వైద్యం అందించేందుకు ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 100 బెడ్స్ తో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది ఆరోగ్యశాఖ. ఈ వార్డుల్లో అవసరమైతే వెంటిలేటర్స్ ని కూడా ఏర్పాటు చేస్తామని ఈటెల రాజేందర్ అన్నారు.
కొత్త వ్యాధులు వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం చెస్ట్ ఆస్పత్రిలో క్లీన్ హాస్పిటల్‌ను నిర్మించనుంది. అటు కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.