Covid Effect Kids Reading,
Covid Effect on Kids : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. ప్రపంచ దేశాలను అతులాకుతలం చేసేసింది ఈ మాయాదారి కరోనా.. ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగా దేశాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. అంతటితో ఆగలేదు.. శారీకరంగా.. మానసికంగా ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసేసింది ఈ కరోనా.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది విలువైన జీవితాలను కోల్పోవాల్సి వచ్చింది.
కరోనా బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే.. మిలియన్ల కేసులతో ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమై రోడ్డునపడివారు లేకపోలేదు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో లాక్ డౌన్లతో విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేయడంతో చదువుకునే పరిస్థితులు లేకుండా పోయాయి.
ఫిజికల్ క్లాసులు నిర్వహించే పరిస్థితులు లేక ఆన్ లైన్ క్లాసులను నిర్వహణతో అంతంతమాత్రంగానే కొనసాగాయి. ఫలితంగా పిల్లల చదివే సామర్థ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది. దాంతో విద్యార్థుల చదువు సామర్థ్యాలు కింది తరగతికే పరిమితమయ్యాయని ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా పరిస్థితుల్లో పిల్లల చదువుపై ఎంతవరకు ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పిల్లల్లో పుస్తక పఠనం, అక్షరాలను గుర్తించలేకపోతున్నారు :
ప్రధానంగా కరోనా మహమ్మారి పశ్చిమ బెంగాల్‌లో చిన్నారుల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు గుర్తించారు. ఆ పిల్లల్లో పాఠాలను చదివే సామర్థ్యాలను కోల్పోయినట్టు సర్వేలో తేలింది. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, లివర్ ఫౌండేషన్ సహకారంతో వార్షిక విద్యా స్థితి నివేదిక (ASER పశ్చిమ బెంగాల్) కొత్త సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బెంగాల్ లోని చిన్నారులు చదవడం, రాయడం, లెక్కించే సామర్థ్యాలను కోల్పోయినట్టు గుర్తించింది. సర్వే డేటా ప్రకారం.. 3వ తరగతిలో 27.7 శాతం మంది పిల్లలు మాత్రమే రెండో తరగతి స్థాయి పాఠాలను చదవగలగుతున్నారు. అప్పటివరకూ 36.6 శాతంగా ఉన్న పిల్లలు 2018 నుంచి వారి చదివే సామర్థ్యాలను కోల్పోయారు.
5వ క్లాసులో 48శాతం మాత్రమే 2 తరగతి పాఠాలు చదవగలరు :
2014లో 32.9 శాతం మంది పిల్లలు మాత్రమే రెండో తరగతి స్థాయి పాఠాలను చదవగలరని సర్వేలో తేలింది. ఇక 5వ తరగతిలో 48 శాతం మంది పిల్లలు క్లాస్-2 స్థాయి పాఠాలను మాత్రమే చదవగలరని డేటా తెలిపింది. 2018లో (50.5 శాతం), 2016 (50.2 శాతం), 2014 (51.8 శాతం)తో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. 2021లో 53 శాతం మంది చిన్నారులు మాత్రమే 2వ తరగతికి సంబంధించి పాఠాలను చదవగలరు. 2018లో 66.2 శాతం మంది, 2014లో 54.8 శాతం మంది మాత్రమే ఉన్నారు. డిసెంబర్ 2021లో 17 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 11,189 మంది పిల్లలు పాల్గొన్నారు. నోబెల్ గ్రహీత అభిజిత్ వినాయక్ బెనర్జీ బుధవారం సాయంత్రం ఈ నివేదికను విడుదల చేశారు.
కరోనాను కట్టడి చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ అడ్వైజరీ కమిటీకి బెనర్జీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్‌లు విద్యార్థుల ప్రాథమిక అభ్యాసానికి ఆటంకం కలిగించాయని చెప్పారు. బెంగాల్ రాష్ట్రంలోని పాఠశాలలు వీలైనంత త్వరగా తిరిగి తెరవాలని సూచించారు. కరోనా పరిస్థితి మెరుగుపడిందని, బెంగాల్‌లోని అన్ని పాఠశాల క్యాంపస్‌లను వీలైనంత త్వరగా తెరవాలని ఆయన సూచించారు. 2020లో కరోనా ప్రపంచాన్ని నాశనం చేసింది. దాదాపు రెండు ఏళ్ల తర్వాత, పిల్లలకు విద్యాపరమైన అభ్యాసన నష్టాన్ని అంచనా వేయడం అత్యవసరమని లివర్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అభిజిత్ చౌదరి తెలిపారు.
Read Also : Key Proposals : సినిమా టికెట్ రేట్లు, థియేటర్లలో షోలపై కమిటీ కీలక ప్రతిపాదనలు