తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన జగన్, చంద్రబాబు

టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి.

CPI Narayana welcomes supreme court judgement on electoral bonds

CPI Narayana: మోదీ సర్కారు రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందని, కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతో రైతులు ఆందోళన చేపట్టారని జాతీయ కార్యదర్శి నారాయణ సీపీఐ అన్నారు. హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేవుళ్లను ఒక వైపు పూజిస్తూ, మరోవైపు రైతులను చితక బాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీకి ఏ దేవుడైనా రైతులను చితక బాదమని చెప్పారా అంటూ ప్రశ్నించారు. పురాతనమైన దేవాలయాలు, మసీదులను మోదీ తవ్విస్తున్నారు.. పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గోతులు తవ్వడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

కేంద్రానికి చంద్రబాబు దాసోహం
మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉంటే ఎందుకు ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి జగన్ బానిస కాబట్టి ఆ ప్రభుత్వం జోలికి పోలేదన్నారు. ”కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు ఆడారు. భారత దేశం చరిత్రలో బెయిల్ పై సుదీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్. 17ఏ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి చంద్రబాబు కేంద్రానికి దాసోహం అంటున్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి. విభజన హామీలను ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదు. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టార”ని దుయ్యబట్టారు.

కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం
కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే.. ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారని నారాయణ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ఫిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ”కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ బాగా తెలివైనదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మ్యానేజ్ చెయ్యాలనుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. వేల కోట్ల అవినీతికి కేసీఆర్ బాధ్యుడు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి. మొన్నటి దాకా బీఆర్ఎస్ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవినీతి చేసింది బిఆర్ఎస్ నేతలే. ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీశ్‌రావు అనడం సిగ్గు చేటు. ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ తపన పడుతుంది. బిఆర్ఎస్ నేతలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నారు. రెండు నెలలు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట.

Also Read: 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. ఏపీ రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ.. పూర్తి వివరాలు

ఎలక్ట్రోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నల్ల డబ్బు చేరుతుంది. ఈ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బు చేరింద”ని నారాయణ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు