ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం స్థాయి పెరిగినందునే మంచు ఆవహించిందని అధికారులు వెల్లడించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) లెక్కల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5పై కాలుష్య తీవ్రత 346 పాయింట్లుగా ఉంది. పొగమంచు వల్ల 14 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
సూచిక 201 నుండి 300 మధ్య నమోదైతే గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్లు లెక్క. 301 నుంచి 400 మధ్య నమోదైతే ప్రమాదకర స్థాయి తీవ్రంగానూ, 401 నుంచి 500 మధ్య నమోదైతే ప్రమాదకర స్థాయి అత్యంత తీవ్రంగానూ ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సూచిస్తోంది. ఈ వివరాల ప్రకారం ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాల ప్రమాదకర స్థాయిలో నమోదు కాగా, 26 ప్రాంతాల్లో చాలా తక్కువ గాలి నాణ్యత నమోదైనట్టు తెలిపింది.
ఢిల్లీ అంతటా సరాసరిన గాలి నాణ్యత సూచిక 346గా నమోదయింది. ఫరీదాబాద్, నోయిడాలలో కూడా పేలవమైన గాలి నాణ్యత నమోదైనట్టు సీపీసీబీ డేటాలో నమోదైంది. ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరిందని సెంటర్-రన్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (ఎస్‌ఏఎఫ్‌ఏఆర్) కూడా వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా మరింతగా గాలి నాణ్యత క్షీణించే అవకాశం ఉందని, దట్టమైన పొగమంచు కమ్ముకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలావుండగా, ఢిల్లీలో శనివారం ఉదయం 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి.