Delhi Assembly Election Results 2025
Delhi Assembly Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (BJP) ప్రారంభ ట్రెండ్‌లలో సగం మార్కును దాటేసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రం 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి ఓటమి దిశగా కొనసాగుతోంది.
ప్రారంభ ట్రెండ్స్‌లో.. గతంలో ఆద్మీ పార్టీ అభ్యర్థి అజేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన బద్లి సీటు నుంచి పార్టీ ముందంజలో ఉంది. అయితే, కొద్ది నిమిషాల క్రితం బీజేపీ అభ్యర్థి ఆహిర్ దీపక్ చౌదరి ముందంజలో ఉన్నారు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
దశాబ్ద కింద ఖాతా తెరిచిన కాంగ్రెస్ :
దశాబ్దం క్రితం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తన ఖాతాను తెరిచింది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈసారైనా ఢిల్లీ పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది.
హస్తం పార్టీకి 24.55 శాతం ఓట్లు దక్కగా, బీజేపీకి 33.07 శాతం ఓట్లు, ఆప్‌కు 29.49 శాతం ఓట్లు వచ్చాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకోగా, రెండు దశాబ్దాలకు పైగా దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవలే విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఆప్ కంటే ఆధిక్యాన్ని ఇచ్చాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ చారిత్రాత్మకంగా పార్టీ పనితీరును తక్కువగా అంచనా వేశాయని ఆప్ నేతలు అభిప్రాయపడ్డారు. ఎలాగైనా తాము తిరిగి అధికారంలోకి వస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఓడించి, ఢిల్లీ రాజకీయ పటంలో ఆప్ తన ఆధిపత్యాన్ని స్థాపించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలను గెలుచుకుంది. 2020లో ఆ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 62 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లను చిత్తు చేసింది. ఆప్ విజయంతో ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిపత్యాన్ని, జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రతిష్టను పెంచింది.
అయితే, బీజేపీ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావడమే కాదు.. దశాబ్ద కాలంగా పోటీ పడుతున్న ఆప్, కేజ్రీవాల్ మంత్రాన్ని బద్దలు కొట్టడంలో కమలం పార్టీ విజయం సాధించినట్టే.