×
Ad

Delhi blast : ఢిల్లీ పేలుళ్ల ఘటన.. అనుమానితుడు ఇతనే.. పేలుళ్లకు ముందు ఎర్రకోట దగ్గర అతనేం చేశాడంటే..

Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో..

Delhi blast

Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. తొమ్మిది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతికాగా.. 24 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఢిల్లీ పేలుళ్లకు కారణమైన అనుమానుతుడి తొలి ఫొటో బయటపడింది.

ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు బృందాలు తమ దర్యాప్తును వేగవంతం చేశాయి. ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఫొటో బయటకొచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిన వైట్ హ్యుందాయ్ ఐ20 కారు ఉమర్‌దిగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 24 ఫిబ్రవరి 1989న ఉమర్ జన్మించాడు. అల్‌ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు సోమవారం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అయితే, వీరిలో ఇద్దరు వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లకు ఉమర్ సన్నిహితుడు. టెర్రర్ మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులను దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న ఉమర్ ఫరీదాబాద్ నుంచి పోరిపోయాడు. ఆ తరువాత అతను ఈ పేలుడుకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్‌ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఉగ్రదాడికి పాల్పడినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొంటున్నాయి.

ఇదిలాఉంటే.. ఎర్రకోట సమీపంలో పేలిన హ్యుందాయ్ ఐ20 కారు బాదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి రావడాన్ని సీసీ టీవీ పుటేజీల్లో పోలీసులు గుర్తించారు. ఆ కారు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పాత ఢిల్లీకి వచ్చినట్లు గుర్తించారు. HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనం మూడు గంటలకుపైగా ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిలిపి ఉందని, మధ్యాహ్నం 3.19గంటల సమయంలో ఆ కారును పార్కింగ్ చేసినట్లు గుర్తించారు. పేలుడుకు సంబంధించి సూచనలకోసం వారు అక్కడ ఎదురు చూసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయితే, ఉమర్ తోపాటు ఇంకెవరైనా ఉన్నారా.. అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు.