ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్డు ట్యాక్స్ మాఫీ

  • Publish Date - October 11, 2020 / 10:24 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇకపై రోడ్డు పన్ను ఉండదు. రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను మినహాయింపు ఇస్తూ రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీని కోసం ప్రజల నుండి సూచనలు కోరింది. మూడు రోజుల్లో సూచనలు వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయవం తీసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రహదారి పన్నును మాఫీ చేస్తామని కూడా ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు



ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ప్రకటించినప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్డు పన్నును మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన మేరకు ఈ హామీ నెరవేర్చారని ట్వీట్ ద్వారా గెహ్లాట్ అభినందించారు. ఈ-వెహికల్ పాలసీ ప్రకటించిన తరువాత, ఢిల్లీ ప్రభుత్వం బ్యాటరీతో నడిచే వాహనాలపై రోడ్డు పన్నును మాఫీ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వేగంగా వ్యాప్తి చెందడంలో ఢిల్లీ దేశానికి మార్గదర్శకంగా ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది.



ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల వ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతో పాటు కాలుష్యం కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. ఢిల్లీ మోటారు వాహనాల పన్ను చట్టం కింద రవాణా శాఖ అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని తరువాత, ఇప్పుడు ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నప్పుడు, వాహన వినియోగదారునికి రహదారి పన్నులో పూర్తి మినహాయింపు లభిస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఈ మినహాయింపు అమల్లోకి వచ్చింది. అంటే, అక్టోబర్ 10, 2020 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రోడ్డు పన్ను ఉండదు.



ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా రోజుల నుంచి భావిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ కల ఏమిటంటే, 2024 నాటికి కొత్త వాహనాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ ఉండాలి. కొత్తగా కొనుగోలు చేసిన బస్సుల్లో 50 శాతం ఎలక్ట్రిక్. ఢిల్లీని ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా మార్చాలని కేజ్రివాల్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగి ప్రమాదకర స్థాయిలో వాతావరణం దెబ్బ తినగా.. ఈ నిర్ణయం వాతావరణంలో మార్పు తెస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.