వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్‌లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్‌ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపనున్నట్లు అధికారులు తెలిపారు. అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటికే పీయూశ్ గోయెల్ ట్విట్టర్ ద్వారా నవరాత్రులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిద్ధమవుతుందని ప్రకటించారు. అంతేకాక ఐఆర్సీటీసీ కూడా నవరాత్రుల రోజుల్లో వ్రతానికి సంబంధించిన ఆహారాన్ని రైళ్లలోనే అందజేస్తుందని వెల్లడించింది. ఈ కొత్త సర్వీసుకు మంచి స్పందన వస్తుందని వేల సంఖ్యలో ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అధికారులు.
రైలు టిక్కెట్ ధరలు, సమయం వివరాలు:
ఢిల్లీ నుంచి కత్రాకు వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కార్ టిక్కెట్ ఖరీదు రూ.1500, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఖరీదు రూ.3వేలు వరకూ ఉంటుంది. ఈ షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి. ఉదయం 6గంటలకు ఢిల్లీలో బయల్దేరి, కత్రాలో మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటుంది. ఈ సర్వీస్ సాయంతో 12గంటల రైలు ప్రయాణాన్ని 8గంటలకు తగ్గించే ప్రయత్నం చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3గంటలకు కత్రాలో బయల్దేరి రాత్రి 11గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. మార్గం మధ్యలో లూధియానా, అంబాలా కంట్, జమ్మూ తావీ రైల్వే స్టేషన్లలో ట్రైన్ ఆగుతుంది.