Delhi Liquor Excise Scam (Photo : Google)
Delhi Liquor Excise Scam : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాఫ్తు అధికారిపై (ఈడీ) సీబీఐ కేసు నమోదు చేసింది. అధికారి లంచం తీసుకున్నట్లు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (Claridges Hotels And Resorts) సీఈవో విక్రమాదిత్య సింగ్, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్ ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అమన్ దీప్ దల్ నుంచి రూ.5కోట్లు లంచం తీసుకున్నారని అభియోగాలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారిపై కేసు నమోదు చేసింది సీబీఐ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఏడాదికిపైగా దర్యాఫ్తు జరుగుతున్న లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ.. రెండు దర్యాఫ్తు సంస్థలు కూడా సంయుక్తంగా దర్యాఫ్తు జరుపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ కేసులో అమన్ దీప్ దల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమన్ దీప్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు.
మార్చి 2 2023 ఈడీ కేసులో, ఏప్రిల్ 18న సీబీఐ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. కాగా, మనీలాండరింగ్ కేసు నుంచి అమన్ దీప్ ను తప్పించేందుకు.. అమన్ దీప్ దల్ కుటుంబసభ్యులు డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో సుమారు రూ.5కోట్ల రూపాయలు తమ ఆడిటర్ ద్వారా ఈడీ అసిస్టెంట్ డైరెక్ట్ పవన్ ఖత్రి, విక్రమాదిత్య, దీపక్ సంగ్వాన్ కి ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అతడిని విడుదల చేయలేదు. మళ్లీ అరెస్ట్ కావడంతో లంచం వ్యవహారం వెలుగుచూసింది. ఈడీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దాంతో వారిపై అవినీతి కేసు నమోదు చేసింది సీబీఐ.
Also Read..Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌తో ప్రియురాలి హత్య, ఆ అనుమానంతో అమానుషం
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో లంచాల ద్వారా దర్యాఫ్తును ప్రభావితం చేశారన్న ఆరోపణలపై ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఖత్రి, విక్రమాదిత్య సింగ్, సంగ్వాన్, అమన్ దీప్ సింగ్ దల్ పై సీబీఐ అవినీతి కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టింది. ఆగస్టు 7వ తేదీనే ఈ కేసు నమోదు చేశారు. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి కేసు, మనీలాండరింగ్ కేసులకు సమాంతరంగా ఈ లంచం కేసుపైనా సీబీఐ దర్యాఫ్తు చేస్తోంది. ఇంకా ఎవరెవరు ఈ ముడుపుల వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు? ఇంకా ఎవరెవరి ఉన్నతాధికారుల హస్తం ఉంది? అన్న కోణంలో ప్రస్తుతం దర్యాఫ్తు జరుపుతోంది సీబీఐ.