Delhi: ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వారికి తరగతులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
వాయు నాణ్యత (ఏక్యూఐ 498గా నమోదు) దిగజారడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 కింద కఠిన కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వాయు కాలుష్య స్థాయిని బట్టి దశలవారీగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. (Delhi)
Also Read: తెలంగాణలో టెట్ షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాఠశాలలకు కొన్ని తరగతుల వరకు హైబ్రిడ్ విధానంలో పని చేయడానికి అనుమతి ఇచ్చింది. అంటే ప్రత్యక్ష తరగతులు, ఆన్‌లైన్ తరగతులు కలిపి నిర్వహించుకోవచ్చు.
ఎన్‌డీఎంసీ, ఎంసీడీ, ఢిల్లీ కాంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు క్లాస్ 12, క్లాస్ 11 విద్యార్థుల తరగతులను సాధ్యమైన చోట్ల హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైబ్రిడ్ విధానం కొనసాగాల్సి ఉంది.
అయితే, వాయు నాణ్యత మరింత క్షీణించడంతో చిన్న పిల్లల విషయంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల తరగతులను పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌కు మార్చాలని పాఠశాలలను ఆదేశించింది. మరోవైపు, 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.