ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాలేజీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి తమ సత్తా
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాలేజీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి తమ సత్తా చాటారు ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు. వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన దేవరపు వెంకటేశ్, అనుగు అంజలారెడ్డి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఢిల్లీ వర్సిటీ పరిధిలోని వేర్వేరు కాలేజీల నుంచి సెంట్రల్ కౌన్సిల్ అభ్యర్థులుగా గెలుపొందారు.
అనుగు అంజలారెడ్డిది తెలంగాణలోని జగిత్యాల జిల్లా అల్లాపూర్. మిరండా కాలేజీలో బీఏ ఫస్టియర్ చదువుతోంది. తన సమీప ప్రత్యర్థిపై 264 ఓట్ల మెజారిటీతో గెలుపొంది సెంట్రల్ కౌన్సిల్ గా ఎన్నికైంది. అంజలారెడ్డి యూనివర్సిటీలో కాలేజీ ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇచ్చే ర్యాంకింగ్ లో మిరండా కాలేజీ తొలి ర్యాంకులో ఉంది.
దేవరపు వెంకటేశ్ ది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. హిందూ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థిపై రికార్డు స్థాయిలో 654 ఓట్ల మెజారిటీ గెలిచాడు. సెంట్రల్ కౌన్సిల్ గా ఎన్నికయ్యాడు. వెంకటేశ్ ఇకపై వర్సిటీలో కాలేజీ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో తెలుగు విద్యార్థులు విజయం సాధించడం 40 ఏళ్ల తర్వాత ఇదే. దీంతో సహచర తెలుగు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వెంకటేశ్, అంజలా కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇకపోతే మిరండా, హిందూ కాలేజీలు రెండూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇచ్చే ర్యాంకింగ్ లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. యూనివర్సిటీ పరిధిలోని 87 కాలేజీలకు నిర్వహించిన ఎన్నికల్లో గురువారం(సెప్టెంబర్ 12,2019) సెంట్రల్ కౌన్సిల్ అభ్యర్థుల ఫలితాలు విడుదల చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఫలితాలు శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) రిలీజ్ చేస్తారు.