Dera Chief Gurmeet Ram Rahim Tests Positive For Covid 19
Covid-19: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) ఆదివారం కరోనా బారినపడ్డారు. అత్యాచారం కేసులో రోహ్తక్‌లోని సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా జూన్ 3 తేదీన అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడికి రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోవిడ్ పరీక్ష కోసం మేదాంత ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ పరీక్షలో పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే గత నెలలో కూడా డేరా బాబా అనారోగ్యానికి గురయ్యారు. బీపీ డౌన్ కావడంతో అతడిని పీజీఎంఐఎస్ ఆసుపత్రికి తరలించారు.
అదే సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని జైలు అధికారులు సూచించగా డేరా బాబా తిరస్కరించారు. ఇక తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో మెదాంతా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డేరా బాబాకు కరోనా సోకిన విషయం తెలియడంతో దత్తపుత్రిక హనీప్రీత్ అతడిని కలిసేందుకు మేదాంత ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు అటెండెంట్ కార్డు ఇవ్వడంతో డేరా బాబును కలిశారు. అటెండెంట్ కార్డు సహాయంతో ఆమె జూన్ 15 వరకు డేరా బాబాను కలుసుకునేందుకు అవకాశం ఉంది.