పోటెత్తిన భక్తులు : కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు

  • Publish Date - February 11, 2019 / 07:44 AM IST

ప్రయాగ్ రాజ్:  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న  కుంభమేళాలో వసంత పంచమి సందర్భంగా ఆదివారం కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.  దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు హర్ హర్ గంగే, గంగా మాతాకీ జై అనే నినాదాలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు. గజ గజ వణికించే చలిలో సైతం తెల్లవారుఝూము నుంచే భక్తులు నదిలో స్నానం చేయటానికి ఉత్సాహం చూపించారు. 

ఆదివారం సూర్యోదయానికి ముందే 50 వేలమంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు  కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు.  జనవరి 15 మకర సంక్రమణరోజూన ప్రారంభమైన కుంభమేళలో ఇప్పటి వరకు  సుమారు 15 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు చెప్పారు.

ప్రస్తుత కుంభమేళాలో చివరిది, మూడోది ఐన షాహీ స్నాన్ ను , వసంత పంచమి సందర్భంగా  చేసేందుకు ఆదివారం లక్షలాది మంది భక్తులు  ప్రయాగ్ రాజ్ తరలి వచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా  అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.  అత్యధిక సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత స్నానం చేయటానికి ఉత్సాహం చూపినట్లు అధికారులు వివరించారు.