Dharmasthala Mass Burial Case: ధర్మస్థల మాస్ బరియల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగా అక్కడ వందలాది మంది మహిళలు, అమ్మాయిలు హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని, మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యలు ఎవరు చేశారు? చనిపోయిన వారంతా ఎవరు? ఈ హత్యల వెనక ఎవరున్నారు? ఇన్నాళ్లూ దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచాడు? ఇన్ని రోజులు మౌనంగా ఉండి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అనేది మిస్టరీగా మారింది.
తాజాగా ఈ కేసు వ్యవహారంలో బెంగళూరులోని ఒక సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది. ధర్మస్థల ఆలయం మతాధిపతి డాక్టర్ డి వీరేంద్ర హెగ్గడే, ఆయన సోదరుడు డి హర్షేంద్ర కుమార్, వారి కుటుంబ సభ్యులు, వారి పరిపాలన కింద ఉన్న సంస్థలపై పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా వ్యక్తులు, మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిరోధించేలా సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది.
డి హర్షేంద్ర కుమార్ సిటీ సివిల్, సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర్, యూట్యూబర్ ఎండి సమీర్ సహా పలువురు వ్యక్తులపై ఇంజక్టివ్ రిలీఫ్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన 11వ అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: పదవికే వన్నె తెచ్చారు.. ఇప్పటివరకు ఉప రాష్ట్రపతులుగా పని చేసిన ప్రముఖులు వీరే..
ఆగస్టు 5న జరగనున్న తదుపరి విచారణ వరకు ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ముద్రించడం, ప్రసారం చేయడం లేదా పోస్ట్ చేయకుండా ప్రతివాదులను కోర్టు నిరోధించింది. అలాగే పిటిషనర్, అతని కుటుంబం, ఆలయం అనుబంధ సంస్థలపై ఇప్పటికే ప్రచురించబడిన అన్ని పరువు నష్టం కలిగించే సమాచారాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తొలగించాలి లేదా డీ-ఇండెక్స్ చేయాలని కోర్టు ఆదేశించింది.
మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రజా ఆరోపణలు వెల్లువెత్తడంతో పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. 1995 నుంచి 2014 మధ్య ఆలయానికి సంబంధించిన గుర్తు తెలియని వ్యక్తుల సూచనల మేరకు మహిళలు, పిల్లల మృతదేహాలను ఖననం చేయమని తనను బలవంతం చేశారని కార్మికుడు ఆరోపించాడు.
నిందితులు ఈ ఎఫ్ఐఆర్ ను ఒక సాకుగా ఉపయోగించి తనపై, తన కుటుంబంపై, వారు పర్యవేక్షించే సంస్థలపై “తప్పుడు, నిరాధారమైన, నిర్లక్ష్యంగా పరువు నష్టం కలిగించే ఆరోపణలు” చేశారని హర్షేంద్ర కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లేదా దర్యాప్తులో ఇప్పటివరకు తనపై లేదా తన కుటుంబంపై ఎటువంటి ఆరోపణలు రాలేదని ఆయన వాదించారు. అయినప్పటికీ, ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచారం చేయబడుతోందని వాపోయారు.
అక్టోబర్ 9, 2012న జరిగిన అత్యాచారం హత్య సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో తనపైన, తనకు సంబంధం ఉన్న సంస్థలపైనా ఆరోపణలు వచ్చాయన్నారు. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేసిందని, సంతోష్ రావు అనే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. విచారణ తర్వాత, నిందితుడిని ట్రయల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసిందన్నారు. హైకోర్టు నిర్దోషిగా విడుదలను సమర్థించిందన్నారు. సిబిఐ దర్యాప్తులో తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని తేలిందన్నారు.
తాను 75వేల మందికి పైగా ఉద్యోగులు, 45వేల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్న స్కూళ్లు, కాలేజీల సొసైటీకి కార్యదర్శిని అని హర్షేంద్ర కుమార్ తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని వాపోయారు. తన సంస్థలు, ఆలయం ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నాయని ఆయన వాదనలు వినిపించారు.
ప్రతివాదులు అలాంటి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయడానికి అనుమతిస్తే పిటిషనర్, ఆలయం, సంస్థలకు కలిగే నష్టాన్ని ఏ విధంగానూ భర్తీ చేయలేమని కోర్టు పేర్కొంది.