‘నేను శవమయ్యాకే మీ చట్టాలు అమలవుతాయ్’

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రానికి గుండెలాంటి కోల్‌కతా నుంచి ప్రదర్శన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి దమ్ముంటే నా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, వీరి చట్టాలన్నీ బెంగాల్‌లో తాను శవమయ్యాకే అమలవుతాయని’ అన్నారు. ర్యాలీలో వందల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఆమెతో కలిసి నడిచారు. మూడు రోజులుగా సిటిజన్ షిప్ యాక్ట్ బిల్లుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 

కేంద్రంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఎన్నార్సీ, సీఏఏను రాష్ట్రంలో అమలు చేయబోను. జైల్లో పెట్టినా సరే కేంద్రానికి లొంగేది లేదు. నల్ల చట్టాలను ఎప్పటికీ అమలు చేయనివ్వను. చట్టాలను రద్దు చేసేంత వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కొనసాగిస్తా’ అని చెప్పారు. ఇతరులకు సలహా ఇచ్చే ముందు ఈశాన్యంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితిని కేంద్రం గమనించలేకపోతుందని సెటైర్ వేశారు. 

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిని మమత ఖండించారు. ఎన్నార్సీపై గళమెత్తినప్పుడు ఒంటరిగా ఉన్నామని, ఇప్పుడు ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళ వంటి ఇతర రాష్ర్టాల సీఎంలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మమత చెప్పారు. 

ఇదిలా ఉంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ.. ర్యాలీకి నేతృత్వం వహించి అందులో పాల్గొనడంపై రాష్ట్ర గవర్నర్ విమర్శలకు దిగారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని జగదీప ధనకర్ అన్నారు. రాష్టంలో ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి.. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.