Waghya : ఛత్రపతి శివాజీ వీర శునకం కథ తెలుసా?

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి తెలియని వారుండరు. కానీ ఆయన పెంపుడు శునకం వాఘ్య గురించి తెలుసా? అది చేసిన త్యాగం తెలుసా?

Waghya

Waghya : ఛత్రపతి శివాజీ తిరుగులేని పోరాట యోధుడు. భారతదేశాన్ని సుస్థిరం చేయడానికి అనేక యుద్ధాలు చేసాడు. శివాజీ పోరాటాలు కథలు కథలుగా చెబుతారు. చాలామటుకు అందరికీ తెలిసినవే. అయితే ఆయన జీవించినంత కాలం ఆయన పక్కనే ఉన్న పెంపుడు కుక్క గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంలో ఈ కథ వెలుగులోకి వచ్చింది.

ఛత్రపతి శివాజీ భారతదేశంలోని మరాఠా రాజ్య వ్యవస్థాపకుడు. పరాక్రమవంతుడు. అద్భుతమైన పాలకులలో ఒకడు. ఆయన వీర గాథలు కథలు కథలుగా విన్నాం. అయితే ఆయన పట్ల విశ్వాసంతో మసులుకున్న ఆయన పెంపుడు కుక్క ‘వాఘ్య’ గురించిన స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. వాఘ్య అంటే మరాఠాలో పులి అని అర్ధమట. వాఘ్య ఎప్పుడూ శివాజీని అంటిపెట్టుకుని తిరిగేదట. ఆయనతో పాటు ఎన్నో యుద్ధాల్లో కూడా పాల్గొందట. చివరికి శివాజీ మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియల సమయంలో చితిలోకి దూకి ఆత్మార్పణ చేసుకుందట. కుక్క విశ్వాసానికి ప్రతిరూపం అంటారు. తను నమ్ముకున్న ప్రభువు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక ఆయనతో పాటు మరణాన్ని కూడా పంచుకుంది.

శివాజీ ఏప్రిల్ 3 1680 లో 50 సంవత్సరాల వయసులో హనుమాన్ జయంతి రోజు మరణించారు. శివాజీ మరణానికి గల కారణం కూడా వివాదాస్పదమైంది. 12 రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో శివాజీ మరణించినట్లు బ్రిటిష్ రికార్డులు పేర్కొన్నాయి. అయితే ఆయన రెండవ భార్య సోయారాబాయి తమ 10 ఏళ్ల కొడుకు రాజారామ్ ను రాజ్య వారసుడిగా చేయడానికి విషం ఇచ్చిందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Also Read: కష్టాలను ఎదిరించి.. ప్రేమను గెలిపించుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. 12th ఫెయిల్ సినిమా ఎవరి లైఫ్ స్టోరీనో తెలుసా?

ఇక శివాజీ మరణం తర్వాత రాయగఢ్ కోటలో ఆయన సమాధిని ఏర్పాటు చేసారు. సమాధి పక్కనే ఉన్న పీఠంపై ఆయన పెంపుడు శునకం వాఘ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసారు. అయితే 2011 లో వాఘ్యకు సంబంధించి చరిత్రలో ఎటువంటి ఆధారాలు లేవనే కారణం చూపించి కొందరు దానిని తొలగించారట. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వాఘ్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. వాఘ్య వీర మరణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లేవు కానీ ఇప్పటికీ మరాఠా ప్రజలు మాత్రం వాఘ్య కథను విశ్వసిస్తారు. ఆ శునకం చేసిన త్యాగాన్ని స్మరిస్తారు.

Also Read: సుధామూర్తి, నారాయణమూర్తి ప్రేమకథకు పునాది వేసింది పుస్తకాలేనట.. ఆ స్టోరీ ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు