ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై CEC కఠిన చర్యలు తీసుకొంటోంది. తాజాగా దూరదర్శన్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీలకు సమయం కేటాయించే అంశంపై ప్రతిపక్షాలు ఈసీకి కంప్లయింట్ చేశాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి బీజేపీకి 160 గంటలను దూరదర్శన్ కేటాయించింది. కాంగ్రెస్‌కు మాత్రం 80 గంటలు మాత్రమే ఉందని..జాతీయ ప్రసార మాధ్యమం వివక్ష చూపుతోందని ఈసికి ఫిర్యాదు చేశాయి.
మరోవైపు ప్రధాని మోడీ మై భీ చౌకీదార్ కార్యక్రమాన్ని దూరదర్శన్ గంటసేపు ప్రసారం చేసింది. దీంతో ఈసీ దూరదర్శన్‌కి నోటీసులు జారీ చేసింది. DDలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన సమయం కేటాయించాలని..ఒక్క ప్రధాని మోడీనే చూపించకుండా అన్ని పార్టీలకు సమయం ఇవ్వాలని దూరదర్శన్‌ని ఈసీ ఆదేశించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఉపన్యాసాలతో కూడిన నమో టీవీ ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, ఆప్ నేతలు కొన్ని రోజుల క్రితం ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.