రైల్వే ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ ప్రచార నినాదం మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే)తో కూడిన టీ కప్పులను వాడటం,రైల్వే టిక్కెట్లపై మోడీ ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.మంగళవారం(ఏప్రిల్-2,2019)భారతీయ రైల్వేస్ కి ఈసీ నోటీసు పంపింది..సంకల్ప్ అనే ప్రభుత్వేతర సంస్థ రైలు ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ రాజకీయ నినాదంతో కూడిన టీ కప్పులను ఉపయోగించినట్లు తమ దృష్టికి వచ్చిందని,ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని తెలిపింది.
2019 మార్చి-29న ఐఆర్‌సీటీసీ జారీ చేసిన అధికారిక ప్రకటనలో ఈ సంఘటన జరిగినట్లు ధ్రువీకరించిందని తెలిపింది. దీనిని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలియజేస్తూ, తక్షణమే ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలని,గురువారం(ఏప్రిల్-4,2019)లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని తెలిపింది.
శతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ‘‘మై భీ చౌకీదార్’’ అనే నినాదాన్ని ముద్రించి ఉన్న టీ కప్పులలో టీ అందజేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.దీనిపై రైల్వే అధికారులు స్పందించి..ఈ టీ కప్పులను ఉపసంహరించినట్లు ప్రకటించారు. ఈ కప్పులను ఉపయోగించిన కాంట్రాక్టర్ కు రూ.1 లక్ష జరిమానా కూడా విధించినట్లు తెలిపారు.