Ec Seized Huge Money : ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు సీజ్.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్

రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.

Ec Seized Huge Money : వందల కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం, కోట్ల విలువ చేసే డ్రగ్స్.. సార్వత్రిక ఎన్నికల వేళ రికార్డు స్థాయిలో నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. పటిష్ట నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ చేసింది. దీంతో రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.

రూ.4,650 కోట్ల విలువైన నగదు, బంగారం, వస్తువులు సీజ్..
ఎన్నికల్లో ధన ప్రవాహానికి చెక్ పెట్టేందుకు ఈసీ ప్లాన్ చేసింది. అధికారుల తనిఖీల్లో కోట్లల్లో నగదు, బంగారం పట్టుబడుతోంది. మరి నిఘాకు చిక్కుండా ఇంకా ఎంత డబ్బు, బంగారం తరులుతోంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది ఈసీ. ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టి ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పట్టుబడుతున్న నగదు చూసి షాక్ అవుతున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ముందే, ఇంకా 6 విడతల ఎన్నికలు మిగిలి ఉండగానే.. రికార్డు స్థాయిలో నగదు, బంగారం పట్టుబడుతోంది.

2019 ఎన్నికల కంటే ఈసారి 3వేల 475 కోట్లు ఎక్కువ సీజ్..
ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి నగదు, ఇతర వస్తువులు సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఇప్పటివరకు ఏకంగా 4వేల 650 కోట్ల విలువైన నగదు, బంగారం, డ్రగ్స్ ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న 4వేల 650కోట్లలో 45శాతం విలువ మాదకద్రవ్యాలదే. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న దానికంటే రూ.3వేల 475కోట్లు ఎక్కువ.

రోజుకు రూ.100కోట్ల విలువైన నగదు, వస్తువులు సీజ్..
ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. పట్టుబడిన 4వేల 650 కోట్లలో 2వేల 68 కోట్లు డ్రగ్స్ విలువే. 400 కోట్ల రూపాయల నగదు, రూ.563 కోట్ల విలువైన బంగారం సీజ్ అయ్యింది. ఇక 500 కోట్ల రూపాయల విలువ చేసే లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓటర్లకు గిఫ్ట్ ల రూపంలో ఇచ్చే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 1152 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఏపీలో 125 కోట్లు, తెలంగాణలో 121 కోట్లు సీజ్..
ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి 125 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం పట్టుకున్నారు అధికారులు. రూ.32 కోట్ల నగదు, 20 కోట్ల విలువైన లిక్కర్, 4 కోట్ల విలువ చేసే డ్రగ్స్, 57 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, 13 కోట్ల విలువైన ఉచితాలను సీజ్ చేశారు. తెలంగాణలో 121 కోట్ల విలువైన నగదు, బంగారం ఇతర వస్తువులు పట్టుబడినట్లు ఈసీ తెలిపింది.

గుట్టుచప్పుడు కాకుండా తరులుతున్న నగదు ఎన్ని వేల కోట్లో?
పక్కా ప్లానింగ్, అందరి సహకారం, ఏజెన్సీల పనితీరు, లేటెస్ట్ టెక్నాలజీతోనే రికార్డు స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్ కమిషన్ వివరించింది. అయితే దర్యాఫ్తు సంస్థలు, అధికారుల కంటపడి పట్టుబడింది 5వేల కోట్లు కాగా.. గుట్టుచప్పుడు కాకుండా, నిఘాకు చిక్కకుండా తరలుతున్న నగదు, లిక్కర్ ఎన్ని వేల కోట్లు ఉందోనన్న అనుమానాలు ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు