కరోనా న్యూ వెర్షన్… బ్రిటన్ నుంచి వచ్చిన 8మందికి పాజిటివ్

Eight passengers from UK test Covid-19 positive   ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్న సమయంలో బ్రిటన్ నుంచి భారత్​కు వచ్చిన పలువురికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధరణ అయింది. యూకే నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులు, సిబ్బందిలో ఎనిమిది మందికి వైరస్ సోకినట్లు తేలిందని ఓ అధికారి మంగళవారం తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారంతా గత రాత్రి యూకే నుంచి దేశానికి చేరిన వారు.

సోమవారం రాత్రి 11.30 గంటలకు లండన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో ఉన్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇందులో ఐదుగురు పాజిటివ్‌గా పరీక్షించారు. అదేవిధంగా, కనెక్టింగ్ విమానం ద్వారా చెన్నై వెళ్లిన మరో వ్యక్తికి అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. కోల్ ​కతాలో మరో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయింది. వీరు బ్రిటన్ నుంచే వచ్చారని అధికారులు తెలిపారు.

అయితే, వీరందరికి సోకింది కరోనా కొత్త జాతేనా? కాదా అని తెలుసుకునేందుకు వారి నమూనాలను ఎన్‌సీడీసీకి పంపారు. అనంతరం వైరస్‌ సోకిన వారందరికీ సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బ్రిటన్‌ లో కొత్త కరోనా వైరస్ జోరు బాగా ఎక్కువగా ఉండటంతో… భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్యా విమాన సర్వీసులన్నింటినీ బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం రాత్రి వరకు మాత్రం సర్వీసులు కొనసాగుతాయని తెలిపింది.

ఈ క్రమంలో మంగళవారం పెద్ద ఎత్తున యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి భారత్‌కు చేరారు. వీరందరికీ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌ని అమృత్‌సర్‌ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పరీక్షల కోసం క్యూలో బారులు తీరారు. అలాగే వారి కోసం వచ్చిన బంధువులతో విమానాశ్రయం కిక్కిరిసింది. ఇదిలా ఉండగా.. చెన్నైలో లండన్‌ నుంచి 14 మందిని పరిశీలనలో ఉంచారు. లండన్‌ ప్రయాణ సంబంధం ఉన్న 1088 పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. మరో వైపు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం స్వాస్థ భవన్‌లో కొత్త కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సమావేశం అవుతుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, ఇవాళ (డిసెంబర్-22,2020)కేంద్రప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది.  మంగళవారం రాత్రి వరకు బ్రిటన్‌ నుంచి భారత్‌కి వచ్చే వారు ఎయిర్‌పోర్టుల్లో RT-PCR టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం మంగళవారం విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ లో తెలిపింది. నవంబర్-25 నుంచి డిసెంబర్-23 లోపల యూకే నుంచి భారత్ కు వచ్చినవారందరూ తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది. టెస్ట్ లో పాజిటివ్ వచ్చినవారికి ప్రతేక ఐసొలేషన్, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి ప్రయాణించిన సహచర ప్యాసింజర్లకు ఇనిస్టిస్ట్యూషనల్ క్వారంటైన్ వంటివి కేంద్ర ఆరోగ్యశాఖ.. విడుదల చేసిన కొత్త గైడ్స్ లో తెలిపింది.