Anukriti Sharma: మేడమ్ మీరు సూపర్.. ఆమె ఇంట్లో కాదు.. జీవితంలో వెలుగులు నింపారు!

Elderly woman in UP finally gets electricity after decades

IPS Anukriti Sharma: మొత్తానికి నూర్జహాన్ ఇంట్లో వెలుగులు విరబూశాయి. ఏళ్లకు ఏళ్లుగా చీకటిలో మగ్గిపోయిన పెద్దావిడ ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా తిమిరంతో సమరం చేసిన ఆమె జీవితం ఇప్పుడు ప్రకాశవంతమైంది. సినిమాల్లో కనిపించే కథలు నిజజీవితంలో ఎదురైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) కు చెందిన 70 ఏళ్ల నూర్జహాన్(Noorjahan) కథ కూడా అలాంటిదే. షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన స్వదేశ్ సినిమా కథను తలపించే ఈ స్టోరీని ఐపీఎస్ అధికారి, బులంద్‌షహర్‌ అడిషనల్ ఏసీపీ అనుకృతి శర్మ(Anukriti Sharma) తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన నూర్జహాన్ ఎన్నో ఏళ్లుగా తనకున్న చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆమె ఇంట్లో కరెంట్ లేకపోవడంతో చీకటితోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న అనుకృతి శర్మ కదిలిపోయారు. అధికార యంత్రాంగంతో మాట్లాడి నూర్జహాన్ ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. తన సిబ్బందితో కలిసి స్వయంగా పెద్దావిడ ఇంటికి వెళ్లి విద్యుత్ మీటర్, బల్బ్, ఫ్యాన్ ఏర్పాటు చేయించారు. స్విచ్ వేయడం, ఆపడం పెద్దావిడకు వివరించారు.

Elderly woman in UP finally gets electricity after decades

మొదటిసారి తన ఇంట్లో బల్బ్ వెలిగినప్పుడు నూర్జహాన్ ముఖంలో విరబూసిన నవ్వులు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని అనుకృతి శర్మ పేర్కొన్నారు. తన ఇంట్లో వెలుగులు పంచిన ఆమెను నూర్జహాన్ భుజం తట్టి మెచ్చుకున్నారు. పోలీసు అధికారులు పెద్దావిడకు స్వీట్లు తినిపించి ఆమెకు మరింత సంతోషాన్నిచ్చారు. నూర్జహాన్ కూడా అనుకృతి శర్మకు స్వీట్ తినిపించి కృతజ్ఞత చాటుకున్నారు. నూర్జహాన్ ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి తనకు సహకరించిన ప్రభుత్వ అధికారులందరికీ అనుకృతి శర్మ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: అతనికి మంచి పెళ్లి సంబంధం చెప్పండి.. మొక్కజొన్న వ్యాపారి కోసం సోనూ సూద్ రిక్వెస్ట్

జూన్ 26న తన ట్విటర్ పేజీలో అనుకృతి శర్మ షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, 25 వేలకు పైగా లైకులు వచ్చాయి. 4 వేల 5 వందలకు పైగా రీట్వీట్లు కొట్టారు. వృద్దురాలి ఇంట్లో వెలుగు నింపిన ఆమెపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచిపని చేశారని, మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉందని కమెంట్స్ పెడుతున్నారు. మీరు పంచిన వెలుగు నిరుపేద అమ్మ ఇంటినే కాదు.. ఆమె జీవితాన్ని కూడా వెలిగించింది. మీరు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకున్నారు.