ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ కీలక వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే..!

పేజర్లను హ్యాక్ చేసినట్లు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

EVM Tampering Charge (Photo Credit : Google)

EVM Tampering Charge : కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశవ్యాప్తంగా 48 స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్, అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలు.. అలాగే లోక్ సభ ఎన్నికల బైపోల్ షెడ్యూల్ తో పాటుగా ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు.

జమ్ముకశ్మీర్, హర్యానాలో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రాజీవ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పేజర్లను హ్యాక్ చేసినట్లు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

అయితే, పేజర్లను హ్యాక్ చేసినట్లు ఈవీఎంలను హ్యాక్ చేయడం అసంభవం అని సీఈసీ రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. పేజర్లు నెట్ వర్క్ కు కనెక్ట్ అయి ఉంటాయని, కానీ, ఈవీఎంలు మాత్రం కనెక్ట్ కావని ఆయన క్లారిటీ ఇచ్చారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించకూడదని హితవు పలికారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్.

ఈవీఎంలు చాలా పారదర్శకంగా పని చేశాయి. మొత్తం 20 ఫిర్యాదులను కాంగ్రెస్ పార్టీ చేసింది. హర్యానాలో ఎన్నికల ఫలితాలను మేము స్వీకరించడం లేదు, మాకు అనుమానాలు ఉన్నాయి, ఓటింగ్ ప్రక్రియ, ఈవీఎంల సరిగా పని చేశాయా లేదా అన్న అంశానికి సంబంధించి అభ్యర్థులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. మొత్తం 20 ఫిర్యాదులు చేసింది కాంగ్రెస్ పార్టీ. వీటన్నింటకి సమాధానం చెబుతామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.

ఈవీఎంల ట్యాంపరింగ్ పై కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటికి సమాధానం ఇస్తామని, వాటన్నింటిని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామన్నారు. ముఖ్యంగా మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈవీఎంలను భద్రపర్చడం జరుగుతుందన్నారు. కాబట్టి ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కానీ ఫలితాలను తారుమారు చేసే ప్రక్రియ ఏదీ కానీ చేయడానికి ఆస్కారమే లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ స్పష్టం చేశారు. ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినంత మాత్రాన.. ఎగ్జాట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా రావాలని లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Also Read : మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు, ఫలితాల తేదీల పూర్తి వివరాలు..