జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ : ఐదుగురు మావోలు మృతి 

  • Publish Date - January 29, 2019 / 06:18 AM IST

సింగభూం : జార్ఖండ్ అడవుల్లో తుపాకులు ఘర్జించాయి. సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో ఈరోజు ఉదయం (జనవరి 29)న భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న పక్కా సమాచారం అందగా…సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. వీరికి మావోలు తారసపడగా, లొంగిపోవాలని హెచ్చరించినా, వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, దీంతో ఎన్ కౌంటర్ అనివార్యమైందని ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకున్నాడని ప్రకటించారు. అతని కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నామని, కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.