రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంని ప్రధాని మోడీతో కలిసి ప్రారంభించిన ట్రంప్…స్టేడియంలో హాజరైన 1లక్ష25వేల మందిని ఉద్దేశించి మాట్లాడారు. మెలానియాతో పాటు మా కుటుంబం అంతా ఈ స్వాగతాన్ని,ఆతిధ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు ట్రంప్.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు ట్రంప్. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని టఫ్ నెగోషియేటర్(కఠినమైన రాయబారి)గా అభివర్ణించారు. భారత్-అమెరికాల మధ్య చాలా సమగ్రమైన వ్యాపార ఒప్పందం కోసం తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఆ విధంగా రెండు దేశాలు లాభపడతాయన్నారు. అమెరికా ఎగుమతులకు భారత్ చాలా పెద్ద మార్కెట్ అన్న ట్రంప్….ఎగుమతుల విషయానికొస్తే అమెరికా భారతదేశపు అతిపెద్ద మార్కెట్ అన్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం 40శాతం పెరిగిందన్నారు.
త్వరలోనే భారత్ తో పెద్ద వాణిజ్య కుదుర్చుకుంటామన్నారు. ప్రస్తుతం డీల్ పై చర్చలు జరుగతున్నాయని,మోడీ చాలా గట్టి నెగోషియేటర్ అని ట్రంప్ అన్నారు. మోడీని డీల్ చేయడం చాలా కష్టమన్నారు. ప్రధానమంత్రి మోడీ చాలా గ్రేట్ లీడర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మోడీని ప్రేమిస్తారని,కానీ ఆయన చాలా టఫ్ అని ట్రంప్ తెలిపారు. భారత్ తో 3బిలియన్ డాలర్ల ఢిఫెన్స్ డీల్ కు ఈ సందర్భంగా ట్రంప్ ఓకే చెప్పారు. హెలికాఫ్టర్లు,రక్షణరంగ పరికరాల కోసం ఒప్పందంపై మంగళవారం సతంకాలు ఉంటాయని మొతేరా స్టేడియంలోనే ట్రంప్ పెద్ద ప్రకటన చేశారు.
See Also>>తాజ్ మహల్ తో ట్రంప్ అనుబంధం
అమెరికా భారత్ ను ప్రేమిస్తుంది అనే సందేశం ఇచ్చేందుకు భార్య మెలానియాతో కలిసి తాను ప్రపంచం చుట్టూ 8వేల మైళ్లు ప్రయాణం చేశామని ట్రంప్ తెలిపారు. అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందన్నారు. మా గుండెల్లో భారత్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది అని ట్రంప్ అన్నారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో భారత ఎదిగిన తీరు చెప్పుకోదగినదని అన్నారు. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో భారత్ ఎదిగిన తీరు అసాధారణమన్నారు.
భారతీయులు మిగతా ప్రపంచానికి ఆదర్శం అని ట్రంప్ అన్నారు. భారత్ మాకెంతో గర్వకారణం అని అన్నారు. భారతీయులు ఏదైనా సాధించగలరన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సంచలనాలు సృష్టిస్తోందని అన్నారు. పదేళ్లలో పేదరికాన్ని కనిపించకుండా చేశారన్నారు. మౌళిక సదుపాయల కల్పనలో భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. అంతరిక్ష రంగంలోనూ భారత్-అమెరికా కలిసి పనిచేస్తాయన్నారు.
నమస్తే ఇండియా అంటూ ప్రసంగం ప్రారంభించిన ట్రంప్…మొదటగా నా ప్రత్యేక ఫ్రెండ్ మోడీకి ధన్యవాదాలు అని చెప్పారు. యువకుడిగా ఉన్నప్పుడు మోడీ ఇదే నగరంలో ఛాయ్ వాలాగా పనిచేశారన్నారు. ఛాయ్ వాలా కోడుకుగా పుట్టి అసాధారణ స్థాయికి మోడీ ఎదిగారన్నారు. మోడీ చాలా గొప్ప వ్యక్తి అని ట్రంప్ అన్నారు. మోడీ ఒక్క గుజరాత్ కే గర్వకారణం కాదని,ప్రపంచానికి మోడీ స్ఫూర్తి ప్రదాత అన్నారు.
మోడీ కష్టజీవి అని,భారతీయులు ఏదైనా సాధించగలరు అనడగానికి మోడీ ఓ సజీవ ఉదాహరణ అని ట్రంప్ అన్నారు. మోడీ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. దేశం కోసం మోడీ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తారన్నారు. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోడీ ఒకరన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తుందన్నారు ట్రంప్. భారత్ లో 7కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
ఉగ్రవాదం విషయంలో భారత్-అమెరికాది ఒకే సిద్దాంతమన్నారు. తన హయాంలో ఐసిస్ ను తుద్దిముట్టించామని ట్రంప్ తెలిపారు. ఐసిస్ ను అణిచివేసేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. ఐసిస్ చీఫ్ మరణం ప్రపంచానికి గొప్ప ఊరట అని ట్రంప్ అన్నారు. సరిహద్దులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉగ్రవాదాన్ని అరికట్టేలా పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చానన్నారు. ఉగ్రవాదం భారత్-అమెరికా కలిసి ఉమ్మడి పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని అమెరికా ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు. గాడ్ బ్లెస్ ఇండియా,గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ తన ప్రసంగం ముగించారు.