స్పాట్ ఫిక్సింగ్‌లో దక్షిణాది క్రికెటర్లు అరెస్టు

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సీఎం గౌతమ్, అక్బర్ ఖాజీలు స్పాట్ పిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న గౌతమ్.. వికెట్ కీపర్, ఆల్ రౌండర్‌గా అక్బర్ ఖాజీ ఆడాడు.  

ఇటీవలే ముగిసిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో బళ్లారి టస్కర్స్, హుబ్లి టైగర్స్ జట్లు తలపడ్డాయి. ఫైనల్లో బళ్లారి టస్కర్స్ జట్టు బ్యాటింగ్ నిదానంగా ఆడేందుకు గాను రూ.20 లక్షలు తీసుకున్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది. 

కర్ణాటక ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత గౌతమ్ ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ సీజన్‌లో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఖాజీ మిజోరాంకు ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ వంటి జట్లకు గౌతమ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు మొత్తం 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ 4716 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2013-14 మరియు 2014-15లలో కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో గౌతమ్ ఎంతో కీలకంగా వ్యవహారించాడు. ఖాజీ.. మిజోరాం జట్టుకు ఆడటానికి ముందు గత సీజన్‌లో నాగాలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరాం జట్టు తరుపున ఎంపికయ్యాడు.