Harish Rawat: ఓటు వేయడానికి వెళ్లిన మాజీ సీఎం.. ఓటర్ల జాబితాలో పేరే లేదని తెలియడంతో..

ఓటరు జాబితా నుంచి పేర్లను చేర్చడం, తొలగించడంలో బీజేపీ నిమగ్నమైందని ఆరోపించారు.

Harish Rawat

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుందామని డెహ్రాడూన్‌లోని నిరంజన్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వెళ్లారు. అయితే, ఓటర్ల జాబితాలో అంతటి సీనియర్‌ నేత పేరు లేదు.

ఈ విషయాన్ని ఎన్నికల సిబ్బంది చెప్పడంతో హరీశ్ రావత్ విస్మయానికి గురయ్యారు. అంత పెద్ద నేతకే ఇలాంటి అనుభవం ఎదురైతే సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటని విమర్శలు వస్తున్నాయి.

హరీశ్ రావత్ చాలాకాలంగా డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేశారు. ఈ సారి మాత్రం తన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ హరీశ్ రావత్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇవాళ ఉదయం నుంచి ఎదురుచూస్తున్నానని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన పోలింగ్‌ కేంద్రంలో ఇప్పుడు తన పేరు కనిపించలేదని అన్నారు. ఎన్నికల సిబ్బంది తన పేరును ఓటర్ల జాబితాలో వెతుకుతున్నారని చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దామని తెలిపారు.

తనను ఎదురుచూడాలని ఎన్నికల సంఘం అధికారులు కోరారని హరీశ్ రావత్ వివరించారు. ఓటరు జాబితా నుంచి పేర్లను చేర్చడం, తొలగించడంలో బీజేపీ నిమగ్నమైందని ఆరోపించారు. తాను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని అన్నారు. తాను ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని చెప్పారు.

అయితే, ఇప్పుడు తన పేరే లేకుండా పోయిందని అన్నారు. తాను ఇవాళ ఉదయం నుంచి పోలింగ్‌ స్టేషన్‌ వద్దే ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని చెప్పారు. తనలాంటి నేతకే ఇలా జరిగిందంటే ఇది అప్రమత్తం కావాల్సిన సమయమని అన్నారు. ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Harish rao: అన్యాయం, అమానుషం అంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం.. ఏం జరిగిందో తెలుసా?