బీజేపీ T షర్ట్ వేసుకుని రైతు ఆత్మహత్య

సమస్యలు వినే వారు లేక రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వంపై పెను ప్రభావం చూపించే అవకాశముంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 35ఏళ్ల రాజు తల్వారె అనే రైతు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్ ఎన్నికల ప్రచారంలో ఉన్న అదే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు పడుతున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే నిరసనతో బీజేపీ టీ షర్టు వేసుకుని చెట్టుకు ఉరివేసుకున్నాడని ఇంగ్లీషు మీడియా తెలిపింది. 

బుల్దానా ప్రాంతం నుంచి పోటీ చేసి గెలిచిన లేబర్ మంత్రి సంజయ్ కుటే నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో జరిగిన నష్టాలు రైతు మనుగడకు కష్టంగా మారింది. రెండు మూడేళ్లుగా పంట నష్టాలు సంభవించడం వల్ల మహారాష్ట్రలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రుణాల గురించి రైతులపై ఒత్తిడి తీవ్రం చేసింది.