Farmers Protest
Farmers Protest: కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో రైతు ఉద్యమం మరింత ఉధృతం కానుంది. తదుపరి కార్యచరణను ప్రకటించిన కిసాన్ సంయుక్త మోర్చా.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ బయట నిరసన తెలపాలని నిర్ణయాన్ని వెల్లడించింది. నిరసనలో ప్రతి రోజూ 200మంది వరకూ రైతులు పాల్గొనాలని రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ తెలియజేశారు.
అంతేకాకుండా విపక్ష పార్టీలు పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై పోరాడాలని కోరుతూ జులై 17న లేఖలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఒక్కో రైతు సంఘం నుంచి.. ఐదుగురు చొప్పున నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ జూలై 8న దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రజలంతా ధరల పెరుగుదలకు నిరసనగా వాహనాలను ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిలిపి నిరసన వ్యక్తం చేయాలని ప్రకటించారు.
ఏడున్నర నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతు నిరసనలకు న్యాయం చేయాలని కాంక్షించారు.