దీర్ఘకాలిక ఆందోళన కోసం ఏర్పాట్లు షురూ చేసిన రైతులు

దీర్ఘకాలిక ఆందోళన కోసం ఏర్పాట్లు షురూ చేసిన రైతులు

farmers-protest

Updated On : February 11, 2021 / 9:51 PM IST

farmers నూతన వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో తొలిగేలా లేకపోవడంతో రైతులు రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయనున్నారు. నిరసనలను దీర్ఘకాలం కొనసాగించడానికి పూనుకున్నారు రైతులు. దీనికి తగ్గట్టుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దు ప్రాంతంలో సౌకర్యాలను మరింతగా పెంచుకుంటున్నారు. సీసీ కెమెరాలు, కంట్రోల్​ రూం, ఇంటర్నెట్​ తదితర సదుపాయాల్ని సమకూర్చుకుంటున్నారు.

నిరసనల ప్రదేశంలో సదుపాయాల్ని సమకూర్చే దీప్​ ఖాత్రీ మాట్లాడుతూ..దీర్ఘకాలం పాటు ఆందోళనను కొనసాగించడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఉద్యమంలో అరాచక శక్తులు చేరితే వారిని గుర్తించడానికి వంద సీసీ కెమెరాలను, కంట్రోల్​ రూం ను సిద్ధం చేసుకుంటున్నాం. ఒకవేళ కేంద్రం అంతర్జాల సేవలను నిలిపి వేస్తే సొంతంగా ఆప్టికల్ ఫైబర్​ను కూడా ఏర్పాటు చేసుకుంటాం అని తెలిపారు. పెట్రోలింగ్​ కోసం 600 మంది వలంటీర్లను సిద్ధం చేశామని.. వారు ట్రాఫిక్​ను నియంత్రిస్తూ, ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా చూస్తారని తెలిపారు. వారందరికీ గుర్తింపు కార్డులను, ప్రత్యేక దుస్తువుల్ని ఇస్తామని తెలిపారు.

ఇక, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని, ఎంఎస్​పీకి చట్టబద్ధత కల్పించేంత వరకు ఢిల్లీ సరిహద్దులను వీడేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్​ స్పష్టం చేశారు. రహదారులపై కేంద్రం ఏర్పాటు చేసిన ఒక్కో మేకును తొలగిస్తామని చెప్పారు. స్వప్రయోజనాల కోసమే ఉద్యమంలో పాల్గొంటున్నారన్న ఆరోపణలను ఖండించారు. రైతుల ఉద్యమానికి అపకీర్తి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టికాయిత్ ఆరోపించారు.