Serum Institute:ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరిగింది. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ 1గేటు వద్ద ఇవాళ(జనవరి-21,2021)మధ్యాహ్నాం నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టెర్మినల్ గేట్ 1 వద్ద ఎస్ఈజెడ్-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.
ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు 10 అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు.సాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రంగంలోకి జాతీయ విపత్తు స్పందనా దళం (ఎన్డీఆర్ఎఫ్) దిగింది. అయితే,అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదంతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పని చేసే శాస్త్రవేత్తలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
కాగా,ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించగా..అందులో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఒకటి. రెండవది..ఐసీఎంఆర్ సహకారంలో హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ డెవలస్ చేసిన “కోవాగ్జిన్” అన్న విషయం తెలిసిందే.