firecracker ban violators with GPS-fitted sound monitoring devices : దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ అంటేనే..దీపాలు, క్రాకర్స్ గుర్తుకొస్తాయి. పటాకుల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. రంగు రంగుల తారాజువ్వలు ఆకాశంలోకి దూసుకెళుతూ..అందర్నీ ఆకట్టుకుంటాయి. కానీ..ప్రస్తుతం ఈ సీన్ లేదు. పండుగలపై కరోనా పెద్ద ప్రభావమే చూపిస్తోంది. కాలుష్యానికి తోడు..కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో పటాకులను పేల్చవద్దని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.
పేలిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. కానీ..కొంతమంది పేలుస్తారని ఆ రాష్ట్రం గ్రహించింది. అందుకే కొత్త టెక్నాలజీ వ్యవస్థ ద్వారా వారిని పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. బాణాసంచా పేల్చవద్దని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాళీమాత పూజ సందర్భంగా…ఫైర్ క్రాకర్స్ కాల్చొద్దని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. నిషేధాన్ని ఉల్లంఘించే వ్యక్తులను గుర్తించడానికి సరికొత్త వ్యవస్థను సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ లకు వెయ్యి వరకు జీపీఎస్ అమర్చిన సౌండ్ మానిటరింగ్ పరికరాలను పంపిణీ చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి పటాకులు కాలిస్తే..వారిని ఈ డివైజ్ ద్వారా గుర్తించేలా పశ్చిమ బెంగాల్ పొల్యూషన్ బోర్డు ప్రణాళిక రచిస్తోంది. డివైజ్ ప్రదేశం, సమయాన్ని చూపుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. థర్మల్ ప్రింటర్ ద్వారా ఆధారాలను ప్రాసిక్యూషన్ కోసం ప్రింట్ తీసుకోవచ్చని, డివైజ్ లపై పోలీసులకు అవగాహన కల్పించినట్లు పొల్యూషన్ బోర్డు ఛైర్మన్ కళ్యాణ్ రుద్ర వెల్లడించారు.