మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర శాసనసభలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించబోతున్నారు.
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి. ‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్ కల్సే తెలిపారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్ సీఎంగా పదవిని అందుకోనున్నారు.
తండ్రీ కొడుకులైన కాంగ్రెస్ నేతలు శంకర్‌రావు చౌహాన్, అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి మహారాష్ట్రకు ఎక్కువమంది సీఎంలు పనిచేశారు. ఇప్పటివరకు బీజేపీ, శివసేనల నుంచి ఇద్దరు చొప్పున ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ఉద్ధవ్ శివసేన నుంచి సీఎం అయిన మూడో నేత కానున్నారు. ఎన్సీపీ నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరూ సీఎం కాలేదు.
గవర్నర్ తో భేటి అనంతరం ఈ నెల 28న ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ శాసనసభ పక్షనేత జయంత్ పాటిల్ ప్రకటించారు. గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్ లోని శివాజీపార్క్ లో ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడించారు.