×
Ad

Prices Soaring: బాబోయ్.. మళ్లీ భగ్గుమంటున్న ఆహార పదార్ధాల ధరలు.. కారణమేంటి? ఇదేనా జీఎస్టీ 2.O?

బియ్యం, కందిపప్పు..మినపప్పు..గోధుమపిండి..ఇడ్లీ రవ్వ సరే సరి ఇంతగా నిత్యావసరాలు ఆహార పదార్ధాలు రేటు పెరగడానికి కారణమేంటి..?

Prices Soaring: మళ్లీ అవే సీన్స్. ఏ నిత్యవసర వస్తువు ధర చూసినా భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. క్రిస్ మస్ తో మొదలుకుని సంక్రాంతి వరకు దాదాపు 20 రోజులు ఈ సీజన్ ఉంటుంది. మరి పప్పు, ఉప్పు, వంట నూనె, కూరగాయలు అన్నీ ఇలా రేట్లు పెరిగిపోతుంటే.. జనం పండగ ఎలా చేసుకుంటారు? దానికి తోడు జీఎస్టీ సంస్కరణలతో రేట్లు తెగ తగ్గుతాయని ఊదరగొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి ఆ జీఎస్టీ 2.O సంగతి ఏంటి?

జనం ఏం కొనాలి..ఏం తినాలి..?

బియ్యం, కందిపప్పు..మినపప్పు..గోధుమపిండి..ఇడ్లీ రవ్వ సరే సరి ఇంతగా నిత్యావసరాలు ఆహార పదార్ధాలు రేటు పెరగడానికి కారణమేంటి..? GST 2.0 అంటూ కేంద్రం తెగ ప్రచారం చేసిన పన్నుశ్లాబుల సంగతేంటి? ఈ ప్రశ్నలకు ఏ ప్రజాప్రతినిధులూ జవాబు చెప్పరు..కానీ రాబోయేదంతా పండగ సీజన్..కనీసం 20 రోజులు ఈ పండగ హడావుడి ఉంటుంది..మరి రేట్లు ఇంకా మండిపోయే పరిస్థితే ఉంది..అప్పుడు జనం ఏం కొనాలి..ఏం తినాలి..?

పదిహేను రోజుల క్రితం ఐదు రూపాయలకు దొరికిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం 10 రూపాయలు పలుకుతోంది. ఇది చికెన్ సెంటర్లలో ఓ రేటు ఉంటే..సూపర్ మార్కెట్లలో మరో రేటు ఉంటుంది. రోడ్డుపైన అమ్మేవాడు మరో రేటు చెప్తాడు..ఏది ఎలా ఉన్నా..కోడి గుడ్ల రేటు గుడ్లెళ్లబెట్టేలా చేస్తుందనడంలో సందేహమే లేదు.

కోళ్ల దాణా ఖర్చులు పెరగడం, చలికాలం కారణంగా ఉత్పత్తి పడిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గతంలో రోజుకు 8 కోట్లుగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు బాగా తగ్గిపోయిందంటున్నారు.. సరే కోడి గుడ్డు అంటే ఈ కారణంతో రేటు పెరిగింది..మరి వంట నూనెల పరిస్థితి ఏంటి.. లీటర్ వంట నూనె ఏ బ్రాండ్ సన్‌ఫ్లవర్ చూసినా రూ.150పై మాటే. పామాయిల్ రేటు కూడా రూ.100కి అటూ ఇటూగా అమ్ముతున్నారు. మరీ ఇంత దారుణంగా పెరిగితే ఎలాగనేది యూజర్ల ప్రశ్న.

అసలు నిజంగానే దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి రేట్లు పెరుగుతున్నాయా..ఆ సాకుతో వంటనూనె తయారీ కంపెనీలే ఇలా జనం నెత్తిన బండ పడేస్తున్నాయా.. మలేషియా, రష్యా సహా కొన్ని దేశాల నుంచి మనకి సన్ ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం…డాలర్ రూపాయి మారకపు విలువలో తేడాతో ఇలా రేటు పెరుగుతుందని కొందరు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.. అసలు అంత సీన్ లేదు. డాలర్ మారకపు విలువ 88 రూపాయలకు.. 91 రూపాయలకు మధ్య పెరిగింది 3 రూపాయలైతే.. వంట నూనె లీటర్‌కి 20 రూపాయలు తేడా వస్తుందా..?

ఇక కందిపప్పు రేటు రూ.105 నుంచి రూ.140 పలుకుతోంది. మినపప్పు రేటు కూడా రూ.110 నుంచి 170 పలుకుతోంది. క్వాలిటీని బట్టి లో, హై ప్రైస్ చెబుతున్నారు. బియ్యం కూడా 75 కేజీల బస్తా కనీసం 1200 నుంచి రూ.1700 ఇంకా పైన రేటు పలుకుతోంది.. బ్రాండ్ పేరు చెప్పుకుని ఈ నిత్యావసరాల రేట్లు ఎంతకైనా అమ్మే సమర్ధులు ఉన్నారు. అసలిప్పుడు కేజీ సాధారణ ఉప్పు రేటే 20 రూపాయలంటే విషయం అర్ధం చేసుకోండి..

ఇదేనా జీఎస్టీ 2.O అంటే?

మరి జీఎస్టీలో సంస్కరణలతో జనం పండగ చేసుకోవాలంటూ దసరా, దీపావళి ముందు తెగ హడావుడి చేసిన ప్రభుత్వాలు.. ఈ రేట్ల పెరుగుదలపై ఎందుకు గప్‌చుప్‌గా ఉంటున్నాయో తెలియదు. ఇవన్నీ ఫిక్స్ చేసిన రేట్ల కంటే ఎక్కువే అయితే.. సుమోటోగా జీఎస్టీ డిపార్ట్‌మెంట్లు షాపుల్లో తనిఖీలు చేసి కేసులు పెట్టాలి కదా..ఇది ఓ పామరజనం తాలుకూ డౌటనుమానం.

Also Read: ఆరావళి చుట్టూ అల్లుకున్న రాజకీయం.. పర్యావరణవేత్తల ఆందోళన ఎందుకు? కేంద్రం వాదన ఏంటి..