Mamta Kulkarni Expelled : బాలీవుడ్ అలనాటి హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవల సన్యాసం తీసుకుని అందరినీ విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే. 1990లలో ఓ ఊపు ఊపిన హీరోయిన్ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాలో ఇలా సన్యాసం స్వీకరించడం చర్చకు దారితీసింది. తాజాగా ఈ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మమతా కులకర్ణికి ఊహించని షాక్ తగిలింది. కిన్నార్ అఖాడా నుంచి ఆమె బహిష్కరణకు గురయ్యారు. మహా మండళేశ్వర్ గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు.
డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిపైనా వేటు..
కొందరు మత పెద్దలు, అఖాడాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖాడాలు వెల్లడించారు. అంతేకాదు మమతా కులకర్ణిని అఖాడాలో చేర్చించిన ఆచార్య మహామండళేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగించేశారు.
కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన అలనాటి హీరోయిన్..
ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన మమతా కులకర్ణి ఇటీవలే కుంభమేళాలో సన్యాసం స్వీకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. కిన్నార్ అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె దీక్ష తీసుకున్నారు. ఆమెను మహామండలేశ్వర్ గా నియమించారు. అలాగే ఆమె పేరును శ్రీయామై మమతా నందగిరిగా మార్చారు.
Also Read : గిరిజన బిడ్డను రాయల్ ఫ్యామిలీ అవమానించింది- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని మోదీ
మత పెద్దలు, అఖాడాల నుంచి అభ్యంతరాలు..
అయితే మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ గా నియమించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఒక నటిని అఖాడాలో చేర్చుకోవడమే ఇబ్బందికరం అంటే.. ప్రారంభంలోనే ఆమెకు అంత పెద్ద హోదా ఇవ్వడం ఎలా ఇస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై పలువురు మత పెద్దలు, అఖాడాల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వచ్చాయి.
దాంతో.. ఆమెను కిన్నార్ అఖాడా నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆమెతో పాటు ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణపైనా బహిష్కరణ వేటు పడింది. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరిని బహిష్కరించారు.
Also Read : ఎయిర్‌టెల్, వోడాఫోన్‌కి బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్.. రూ.99కే అన్‌లిమిటెడ్ కాల్స్..!
తన అనుమతి లేకుండా మమతకు దీక్ష అందించడం, మమతపై గతంలో డ్రగ్స్ కేసు ఉండడం వంటి కారణాలతోనే రిషి అజయ్ దాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
1990లలో అందాల తారగా మమతా కులకర్ణి బాలీవుడ్ లో గుర్తింపు పొందారు. అయితే, 2003 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఫారిన్ కు వెళ్లిపోయారు. అనంతరం డ్రగ్స్ రాకెట్ లో మమతా కులకర్ణి పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఇన్నేళ్ల తర్వాత సడెన్ గా ఆమె భారత్ కు వచ్చారు. అందరినీ విస్మయానికి గురి చేస్తూ కిన్నార్ అఖాడాలో చేరి కుంభమేళాలో సన్యాసం స్వీకరించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆమెపై బహిష్కరణ వేటు పడింది.