HD Kumaraswamy: కరెంట్ దొంగిలించిన కేసులో మాజీ సీఎంకు భారీగా ఫైన్

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహ జ్యోతి’ పథకం కింద రెసిడెన్షియల్ కనెక్షన్‌ల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోందని.. 2,000 యూనిట్లు కాదని అన్నారు.

కరెంట్ దొంగలించారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‭డీ కుమారస్వామి విద్యుత్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. దీపావళి రోజున అక్రమంగా విద్యుత్ వాడుకున్నందుకు గాను కుమారస్వామికి 68,526 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు కర్ణాటక విద్యుత్ శాఖ శుక్రవారం పేర్కొంది. కాగా, ఈ ఆరోపణల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కుమారస్వామి ప్రాతినిధ్య జేడీఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది.

‘‘ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడైన హెచ్‌డీ కుమారస్వామికి చెందిన నివాసం.. విద్యుత్ స్తంభం నుండి నేరుగా అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అలంకార దీపాలతో వెలిగిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి విద్యుత్‌ని దొంగలించేంత పేదరికంలో మగ్గిపోతుండడం నిజందా దురదృష్టకరం’’ అని కాంగ్రెస్ ఆయనపై విరుచుకుపడింది. ఇక మరో నేత స్పందిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహ జ్యోతి’ పథకం కింద రెసిడెన్షియల్ కనెక్షన్‌ల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోందని.. 2,000 యూనిట్లు కాదని అన్నారు.

ఈ విమర్శలపై స్వయంగా కుమారస్వామి క్షమాపణ చెప్పారు. దీనిపై వివరణ కూడా ఇచ్చారు. ఇది తన తప్పు కాదని, ప్రైవేట్ డెకొరేటర్ చేసిన పని అని అన్నారు. తనకు ఈ విషయం తెలిసిన వెంటనే కనెక్షన్ తొలగించి, ఇంటి మీటర్ బోర్డు నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విచక్షణారహితానికి తాను క్షమాపణ చెప్తున్నానని పేర్కొన్నారు. బెస్కామ్ (బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ) అధికారులు వచ్చి తనిఖీ చేయొచ్చన్నారు. నోటీసులు జారీ చేయొచ్చని, జరిమానా చెల్లించేందుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు.