ప్రధాని మోడీపై మాజీ జవాను పోటీ : స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు.

  • Publish Date - March 30, 2019 / 03:35 PM IST

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు.

ఉత్తరప్రదేశ్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు. వారణాశి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న మోడీపై తాను కూడా పోటీ చేయనున్నట్లు బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ వెల్లడించారు. హరియాణాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్‌ యాదవ్ జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ సోషల్‌మీడియాలో వీడియో పోస్టు చేసి రెండేళ్ల క్రితం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పగానే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని తెలిపారు. భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడేందుకే పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో గెలవడం, ఓడటం అనేది కాదని.. భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు పోటీకి దిగుతున్ననట్లు ప్రకటించారు. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోడీ యత్నిస్తున్నారని.. కానీ వారి కోసం ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 జమ్ముకశ్మీర్‌లోని భద్రతాసిబ్బందికి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ 2017లో బహదూర్‌ సోషల్‌మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యల కింద ఆయనను విధుల నుంచి తొలగించారు. దీంతో బహదూర్‌ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.