×
Ad

చివరి దశకు చేరుకున్న మావోయిస్టుల ఉద్యమం.. కాంగ్రెస్‌కు సాధ్యం కానిది, బీజేపీకి ఎలా సాధ్యమైంది?

అసలు ఇన్నేళ్లు సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమైంది?

Maoists

Left Wing Extremism: అడవుల్లో ఆకులచాటున దాక్కుంటూ కొన్ని దశాబ్దాలపాటు ఉద్యమం చేశారు అన్నలు. ఇప్పుడు వారి ఉద్యమం చివరి దశకు చేరుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ (ఎంఎంసీ) జోన్‌ ప్రతినిధి అనంత్‌ పేరిట తాజాగా విడుదలైన లేఖలో లొంగిపోతామని ప్రకటించారు. జనవరి 1న ఆయుధాలను విడిచి, ఒక్కొక్కరిగా కాకుండా అందరమూ ఒకేసారి లొంగిపోతామని అన్నారు.

తమ పార్టీ బలహీనమైందని వారే స్వయంగా ప్రకటించారు. మల్లోజులతో పాటు ఆశన్న లొంగుబాటు, హిడ్మా మృతితో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.

తొలిసారి 1967లో నక్సల్‌బరీ ఉద్యమం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లోని ఓ గ్రామం పేరు నక్సల్‌బరీ. ఆ తర్వాత సీపీఐ మావోయిస్టు పార్టీగా ప్రయాణం కొనసాగింది. మావోయిజం స్పూర్తితో ఉద్యమం నడిచింది. ఇప్పుడు ఈ ఉద్యమం చివరిదశకు వచ్చేసింది.

మావోయిస్టులు అంటే ఎవరు?
మావో జెడాంగ్ సిద్ధాంతాలను అనుసరించే కమ్యూనిస్టు ఆయుధ గ్రూపులను మావోయిస్టులు అంటారు. తుపాకీతోనే రాజకీయ శక్తిని స్వాధీనం చేసుకోవచ్చన్నదే మావో భావజాలం. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను కారణంగా వారు చూపుతారు.

భారత ప్రభుత్వాన్ని కూల్చి, సాయుధ విప్లవం ద్వారా తమ కమ్యూనిస్టు పాలన ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అందుకోసం అడవుల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ, భద్రతాబలగాలపై దాడులు చేస్తూ, రహదారులు, పాఠశాలలు, టవర్లు ధ్వంసం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతాల్లో వారు ఉండేవారు.

నక్సలైట్లు అంటే?
నక్సలైట్లు అంటే 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో మొదలైన సాయుధ కమ్యూనిస్టు ఉద్యమంలో చేరిన తీవ్రవాద గ్రూపుల్లోని వారు. భూమి, హక్కులు, అసమానతల పేరు చెప్పుకుని పోరాటం చేశారు. సాయుధ విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి కమ్యూనిస్టు పాలన తీసుకురావాలనుకున్నారు.

నక్సలైట్లు అనేది పాత పేరు. మావోయిస్టులు అంటే ప్రస్తుతం ఉన్న సంస్కరణతో, సీపీఐ (మావోయిస్టు)గా ఏర్పడిన కొత్త గ్రూపు.

ప్రభుత్వాలకు ఇన్నేళ్లు సాధ్యం కానిది ఇప్పుడెలా సాధ్యమైంది?
గతంలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు మావోయిస్టుల విషయంలో సాఫ్ట్‌గా ముందుకు వెళ్లిందన్న వాదనలు ఉన్నాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఉక్కుపాదం మోపుతూ వచ్చింది.

యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ఏర్పాటైనా అది అంత దూకుడుగా ముందుకు వెళ్లలేదు. దానికి 2010 దంతెవాడ ఎటాక్ ఉదాహరణ (ఆ దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు).

యూపీఏ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు వామపక్ష తీవ్రవాదం (LWE) ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదన్న వాదనలు ఉన్నాయి.

Also Read: మనిషి ఆయుష్షును 150 సంవత్సరాలకు పెంచనున్న ఏఐ.. 100 ఏళ్లు దాటినా మనం యంగ్‌గా.. ఎలాగంటే?

ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ సంస్థాగత గందరగోళాన్ని బయటపెట్టింది. 2010 దంతెవాడ దాడి వంటి ఘటనలు ప్రణాళిక, ఇంటెలిజెన్స్‌ లోపాలు వంటి వాటిని బయటపెట్టాయి.

మావోయిస్టులు ధ్వంసం చేసిన రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల వంటివాటిని అప్పటి ప్రభుత్వం రక్షించలేకపోయింది. అలాగే, తిరిగి నిర్మించలేకపోయింది. ఆరోగ్య సిబ్బంది వెనక్కు వెళ్లారు. ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ సహా పలు పథకాలు ఆగిపోయాయి. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో స్థానిక స్వయం పాలన హక్కులు ఇచ్చే చట్టం పీఏఎస్‌ఏ అమలు కాలేదు.

మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక..
కేంద్రంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లిందని చెప్పుకోవచ్చు. మావోయిస్టులపై భద్రతా బలగాలతో ఒత్తిడి పెంచుతూనే, ప్రజలకు అభివృద్ధి పనులతో చేరువ అవ్వడం ద్వారా వామపక్ష తీవ్రవాదాన్ని కేంద్ర సర్కారు లేకుండా చేస్తోంది.

నేషనల్‌ పాలసీ అండ్‌ యాక్షన్‌ ప్లాన్‌ (2015) ద్వారా భద్రతను పెంచింది, అభివృద్ధి కూడా వేగవంతం చేసింది. భద్రతా సంబంధిత వ్యయం కింద రూ.3,364 కోట్లు విడుదల చేసింది. మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు ఖర్చు చేసింది. 336 కొత్త భద్రతా శిబిరాలు, 68 హెలిప్యాడ్లు ఏర్పడ్డాయి.

స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.3,769 కోట్లు ఇచ్చారు. రాష్ట్రాలు రీహ్యాబిలిటేషన్‌ పథకాలు తీసుకువచ్చాయి. వామపక్ష తీవ్రవాదం 2010తో పోల్చితే ఇప్పుడు 81% తగ్గింది. వాటి వల్ల నమోదైన మరణాలు 85 శాతం పడిపోయాయి. ప్రభావిత జిల్లాలు 2013లో 126గా ఉంటే 2025లో 18కి తగ్గాయి. 14,928 కి.మీ రహదారులు, 8,640 టెలికాం టవర్లు, 179 ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలలు, 1,007 బ్యాంకు బ్రాంచీలు, 5,899 పోస్టల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు ఏర్పడ్డాయి.

వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. 2019 నుంచి 2024 మధ్య.. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేసింది.

మావోయిస్టులను ఎదుర్కొనేలా పెద్దఎత్తున కేంద్ర బలగాలను పంపింది. గతంతో పోల్చిచూస్తే భద్రతా బలగాలు ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేతలో బాగా రాటుదేలాయి.

బలగాలను పంపడమే కాదు.. పలు పథకాల కింద మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర సర్కారు భారీగా నిధులు మంజూరు చేసింది. 2018-19 నుంచి 2022-23 వరకు రూ.4,931 కోట్లు మంజూరయ్యాయి. అంతేగాక, హెలికాప్టర్ల ఖర్చులకు మరో రూ.765 కోట్లను కేంద్ర సర్కారు ఇచ్చింది. కేంద్ర సర్కారు ఇచ్చే నిధుల్లో అధిక భాగం అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టారు.

స్పెషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్కీంతో పాటు సెక్యూరిటీ రిలేటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌, స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ పథకాలను కొనసాగించారు. నిధులను పోలీస్‌ స్టేషన్ల నిర్మాణం కోసం, వాహనాలు, ఆయుధాలు, టెక్నాలజీ కొనుగోలు వాటికి కూడా వాడారు. 2019 నుంచి 2024 మధ్య 13,630 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు. అంతేగాక, అదే కాలంలో 13,823 కొత్త సెల్‌ఫోన్‌ టవర్లను నిర్మించారు.

ఏపీలో..?
ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తాము ఏకంగా 1,184 కి.మీ రహదారులు నిర్మించామని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ చెప్పారు. 2013 నుంచి 25 ఏప్రిల్‌ మధ్య వామపక్ష ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 18కి తగ్గిందని ఆయన తెలిపారు.

మావోయిస్టుల్లో సరైన రిక్రూట్‌మెంట్ ఏది?
గతంలో ఇంజినీరింగ్, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు వదిలేసి విప్లవాల వైపు అడుగులు వేసిన వారు మావోయిస్టుల్లో చేరారు. నంబాల కేశవరావు (బసవరాజు), మల్లోజుల వేణుగోపాల్ రావు (అభయ్), బర్సా దేవా, హిడ్మా వంటి వారు ఆ ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపారు. అయితే, కొన్నాళ్లుగా ఇటువంటి వారిని మావోయిస్టులు రిక్రూట్‌మెంట్‌ చేసుకోలేకపోయారు. దీంతో క్రమంగా ఉద్యమం బలహీనపడుతూ రావడానికి ఇది కూడా పరోక్షంగా కారణమైంది.