గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటకు నిలువెత్తు నిదర్శనం సబర్మతీ ఆశ్రమం. . గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది సబర్మతీ ఆశ్రమం. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర సబర్మతీ ఆశ్రమం సొంతం. రైతే దేశానికి వెన్నెముక అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి గాంధీజీ
చదువు కోసం దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చిన తరువాత గాంధీజీ తన మిత్రుడు, బారిస్టర్ (లాయర్)అయిన జీవన్‌లాల్ దేశాయ్‌కి చెందిన కొచరబ్ బంగ్లాలో 1915 మే 25వ గాంధీ ఆశ్రమాన్ని ప్రారంభించారు. కానీ వ్యవసాయం చేయటానికి, పశువులను పెంచటానికి..ఇంకా ఇతర కార్యక్రమాలకు ఈ ఆశ్రమం స్థలం సరిపోలేదు. ఈ ఆశ్రమాన్ని సబర్మతి నది కరకట్ట సమీపంలో 36 ఎకరాల స్థలంలోకి మార్చారు. ఇది 1917 జూన్ 17న జరిగింది. అదే సబర్మతి ఆశ్రమంగా పేరొందింది.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగినది ఈ సబర్మతి ఆశ్రమం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతి వద్ద ఉన్న ఈ ఆశ్రమం గాంధీజీకి స్వాతంత్ర సంగ్రామాన్ని ధైర్యంగా నడిపించడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎంతోమంది మేధావులు, నేతలు, విశ్లేషకులు నిత్యం స్వతంత్ర్య సంగ్రామం గురించి చర్చించుకునే వారు ఈ సబర్మతీ ఆశ్రమంలో.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో కీలక ఘట్టాలయిన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుండే ప్రారంభమైనాయి. అందుకనే భారత ప్రభుత్వం దీన్ని జాతీయ స్మారక స్థలంగా గుర్తించింది.
గాంధీజీ 1930, మార్చి 12న అక్కడికి 241 మైళ్ళ దూరంలో ఉన్న ఉప్పు సత్యాగ్రహ (దీన్నే దండి ఉద్యమం అని కూడా అంటారు) ఉద్యమాన్ని సబర్మతీ ఆశ్రమం నుంచే ప్రారంభించారు. 78మంది అనుచరులతో యాత్ర ప్రారంభించాడు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రగా స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగా ఈ ఉద్యమం సాగింది.
ఆశ్రమ వాసులతో ప్రారంభమైన ఈ ఉప్పు సత్యాగ్రహం దేశమంతా విస్తరించి అహింసా విధానంలో ఆంగ్లేయులను వణికించింది. ఆ సంవత్సరం టైమ్ పత్రిక గాంధీజీని మేటి పురుషుడిగా పేర్కొన్నది. గాంధీజీ సరిగా ఏ ప్రదేశంలో అయితే ఉప్పును చేతిలోకి తీసుకొన్నాడో అక్కడ ఒక స్మృతిచిహ్నం నిర్మించారు. ఇలా ఎన్నో..ఎన్నెన్నో కీలక ఉద్యమాలకు..కీలక ఘట్టాలకు సబర్మతీ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్య మహోద్యామానికి స్ఫూర్తినించ్చింది. ఆశ్రమం 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సబర్మతీ ఆశ్రమం గాంధీ ఆశయాలకు..సిద్ధాంతాలకు వేదికగా నిలిచింది సబర్మతీ ఆశ్రమం.