Giant Python: ఒక స్కూల్ బస్సులో భారీ కొండ చిలువ కనిపించిన ఘటన ఉత్తర ప్రదేశ్, రాయ్‌బరేలిలో జరిగింది. స్థానిక ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సులో సీటు కింద ఒక భారీ కొండ చిలువ ఉన్నట్లు ఆదివారం బస్సు సిబ్బంది గుర్తించారు.
ఆదివారం కావడంతో ఈ బస్సు పార్కు చేసి ఉంది. విద్యార్థులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చిలువను గుర్తించిన సిబ్బంది.. పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు బస్సు దగ్గరకు చేరుకుని బస్సులోంచి కొండ చిలువను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ కొండ చిలువ బస్సు కింది భాగంలో, ఇంజిన్‌లో దాక్కుని ఉంది. అయితే, కొండ చిలువకు ఎలాంటి గాయాలు కాకుండా, సురక్షితంగా దాన్ని రక్షించాలనుకున్నారు అధికారులు. అందుకు తగ్గట్లుగానే, దాదాపు అర గంటకుపైగా శ్రమించి కొండ చిలువను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కొండ చిలువను స్థానిక దల్మావు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది దాదాపు 80 కేజీల బరువు, 11.5 అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A python rescued from a school bus in Raibareli, UP. pic.twitter.com/1mP3EY9njc
— Piyush Rai (@Benarasiyaa) October 16, 2022